సామాన్యుడి విమానంగా గుర్తింపు పొందిన రైల్వే.. ప్రయాణికులకు షాకిచ్చింది. టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ.. ఇవి డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. సాధారణ తరగతి టికెట్ ధరలకు సంబంధించిన 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. 215 కి.మీ. దాటితే ప్రతీ కిలోమీటరుకు పైసా చొప్పున పెరుగుతుంది. అలాగే, నాన్ ఏసీ, ఏసీ టిక్కెట్‌లపై ప్రతీ కిలోమీటరుకు 2 పైసలు చొప్పున చెప్పింది. దీని ప్రకారం.. 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇప్పుడున్న టికెట్ ధరపై అదనంగా రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది.
గత జులైలోనే టికెట్ ధరలను రైల్వే పెంచిన సంగతి తెలిసిందే. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ ప్రయాణానికి కిలో మీటర్‌కు ఒక పైసా చొప్పున పెంచింది. తాజా పెంపుతో ప్రయాణీలపై అదనపు భారం పడనుంది. తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి ఇది ఒకరకంగా చేదువార్తే. రైల్వే శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏటా అదనంగా రూ.600 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను సమతుల్యం చేస్తూనే, ఎక్కువ మందికి అందుబాటు ధరలో ఉంచడమే ఈ చర్య లక్ష్యమని అధికారులు తెలిపారు. సబర్బన్, తక్కువ దూరం ప్రయాణించే రైళ్ల టిక్కెట్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. సబర్బన్ రైలు సర్వీసులు లేదా నెలవారీ పాస్‌ల ధరలు పెరగబోవని వివరించారు.
అయితే, మానవవనరుల కోసం (ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, పెన్షన్లు) ఏటా పెద్ద మొత్తంలో రైల్వే శాఖ ఖర్చు చేస్తోంది. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,63,000 కోట్లు ఖర్చు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరిగాయని రైల్వేలు పేర్కొన్నాయి. మానవ వనరుల వ్యయం రూ. 1.15 లక్షల కోట్లకు పెరగగా, పెన్షన్ ఖర్చులు ఇప్పుడు రూ. 60,000 కోట్లకు చేరాయి. రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, భద్రతను మెరుగుపరిచే ప్రయత్నాల కారణంగా అధిక సంఖ్యలో సిబ్బంది అవసరమయ్యారని, ఇది ఖర్చులను పెంచిందని అధికారులు తెలిపారు. మానవ వనరుల ఖర్చు పెరిగిన నేపథ్యంలోనే కార్గో లోడింగ్, టికెట్ ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద కార్గో-రవాణా రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వే అవతరించిందని అధికారులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa