ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ, తెలంగాణలను కలిపేలా రూ.19,142 కోట్లతో ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే

national |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 09:37 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2025 ఏడాదిలో చివరి క్యాబినెట్ సమావేశం బుధవారం (డిసెంబరు 31న) నిర్వహించారు. ఈ భేటీలో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో 374 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే యాక్సెస్-కంట్రోల్డ్ నాసిక్ -సోలాపూర్- అక్కల్కోట్ కారిడార్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.19,142 కోట్లు కాగా.. BOT (టోల్) పద్ధతిలో నిర్మాణం చేపట్టనుంది. ఇది నాసిక్, అహల్యనగర్, సోలాపూర్ వంటి ముఖ్యమైన నగరాలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుతో అనుసంధానం చేస్తుంది. ప్రధాన మంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా సమగ్ర రవాణా మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. అలాగే, రూ.1,526.21 కోట్లతతో చేపట్టే ఒడిశాలోని ఎన్‌హెచ్ 326 విస్తరణ ప్రాజెక్ట్‌‌కు ఈపీసీ పద్ధతిలో క్యాబినెట్ ఆమోదం తెలిపింది.


కాగా, నాసిక్ నుంచి అక్కల్‌కోట్ వరకు ఉన్న ఆరువరుసల కొత్త గ్రీన్ ఫీల్డ్ కారిడార్‌ను వాధవన్ పోర్ట్ ఇంటర్‌చేంజ్ సమీపంలో ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే, NH-60 (అడెగావ్) జంక్షన్ నాసిక్ వద్ద ఆగ్రా-ముంబయి కారిడార్‌, పాంగ్రి వద్ద (నాసిక్ సమీపంలో) సమృద్ధి మహామార్గ్‌కు అనుసంధానించాలని ప్రతిపాదించారు. దీంతో పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వరకు నిరంతరాయ రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది.


ప్రస్తుతం చెన్నై నుంచి తిరువల్లూరు, రేణిగుంట, కడప, కర్నూలు మీదుగా మహారాష్ట్ర సరిహద్దుల్లోని హసాపూర్‌ వరకు 4-లేన్ల కారిడార్ నిర్మాణం జరుగుతోంది. ఈ ఆరు-లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ప్రయాణ దూరం 201 కిలోమీటర్లు తగ్గి, 17 గంటల సమయం ఆదా అవుతుంది. ఇది లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని ముఖ్యంగా కోప్పర్తి, ఓర్వకల్ వంటి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్పొరేషన్లకు రవాణా సదుపాయం పెంచుతుంది.


పుణే-నాసిక్ ఎక్స్‌ప్రెస్‌వే‌లోని నాసిక్-తాలేగావ్ దిఘే అభివృద్ధి అవసరాన్ని కూడా తీరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ మెరుగైన భద్రత, ఎలాంటి అవాంతరాలు లేని ప్రయాణాలను అందిస్తుంది. ప్రయాణ సమయం, రద్దీ,నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. నాసిక్, అహల్యనగర్, ధారాశివ్, సోలాపూర్ జిల్లాల ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుంది.


గంటకు 100 కి.మీ. వేగంతో డిజైన్ చేసి ఈ ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ కారిడార్‌ సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వాహనాల రాకపోకలకు అనుమతిస్తుంది. దీనివల్ల మొత్తం ప్రయాణ సమయం 31 గంటల నుంచి సుమారు 17 గంటలకు తగ్గుతుంది. దీంతో ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలకు సురక్షితమైన, వేగవంతమైన, నిరంతరాయ కనెక్టివిటీని అందుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa