ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరియాలో అల్ బషర్ అసద్ కాలం నాటి కరెన్సీకి ముగింపు,,,కొత్త నోట్లపై చారిత్రక కట్టడాలు, ప్రకృతి చిహ్నాలు

international |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 09:32 PM

సిరియాలో దాదాపు దశాబ్దానికిపైగా కొనసాగిన అంతర్యుద్ధం డిసెంబరు 2024లో అల్ బషర్ అసద్ పతనంతో ముగిసింది. ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన నిరంకుశ పాలనకు సిరియన్లు చరమగీతం పాడి.. నవశకానికి నాంది పలికారు. సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా నాయకత్వంలో సిరియా ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టారు. అయితే, కేవలం కరెన్సీ మార్పిడి మాత్రమే కాదని, సిరియా జాతీయ అస్తిత్వానికి ప్రతీక అని అల్ షారా పేర్కొన్నారు.


అసద్ పాలన నాటి నోట్లను మార్చి, కొత్త డిజైన్లతో కూడిన కరెన్సీని జనవరి 1, 2026న విడుదల చేశారు. అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా, సిరియా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ ఖాదర్ హుస్రేహ్ ఈ కొత్త నోట్లను రాజధాని డమాస్కస్‌లో ఆవిష్కరించారు. పాత నోట్లలో అసద్ కుటుంబ సభ్యుల చిత్రాలు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో చారిత్రక కట్టడాలు, గులాబీలు, గోధుమలు, ఆలివ్‌లు, నారింజలు, మల్బరీల వంటి వ్యవసాయ, ప్రకృతికి సంబంధించిన చిహ్నాలను ఉంచారు. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు.. కానీ దేశం శాశ్వతమని పేర్కొంటూ.. కొత్త నోట్లపై వ్యక్తుల బొమ్మలకు బదులు సిరియా చారిత్రక కట్టడాలు, సంస్కృతిని ప్రతిబింబించే చిహ్నాలను ముద్రించామని తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా పేర్కొన్నారు.


ఒక ముఖ్యమైన సాంకేతిక మార్పు ఏమిటంటే, కరెన్సీని రీ-డినామినేట్ చేశారు. అంటే కరెన్సీ విలువలో రెండు సున్నాలు తొలగించారు.. దీంతో పాత 100 సిరియన్ పౌండ్ విలువ ఇప్పుడు కొత్త ఒక పౌండ్‌కు సమానం. పాత నోట్ల మార్పిడికి 90 రోజులు గడువు నిర్దేశించారు. ఈ సమయంలో పాత, కొత్త నోట్లు రెండూ చెల్లుబాటు అవుతాయి. అవసరమైతే ఈ గడువును పొడిగించవచ్చు.


సున్నాలను తొలగించడం, డిజైన్లను మార్చడం లావాదేవీలను సులభతరం చేస్తుంది. అయితే, ఈ మార్పు మాత్రమే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచదని అధికారులు అంగీకరించారు. ఉత్పత్తిని పెంచడం, నిరుద్యోగాన్ని తగ్గించడం, బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం వంటి దీర్ఘకాలిక చర్యలపైనే ఆర్థిక పునరుద్ధరణ ఆధారపడి ఉంటుందని షరా నొక్కి చెప్పారు.


ప్రస్తుతం అమెరికా డాలర్ మారకపు విలువ దాదాపు 11 వేల సిరియన్ పౌండ్లుగా ఉంది. దీంతో చిన్న వస్తువు కొనుగోలు చేయాలంటే కట్టల కొద్దీ నగదు తీసుకెళ్లాల్సి వస్తోంది. కొత్త కరెన్సీతో ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత నోట్ల మార్పిడిపై ప్రజలకు ఎలాంటి ఆందోళన వద్దని, ద్రవ్యోల్బణం అదుపులో ఉంచుతూ క్రమంగా కొత్త కరెన్సీని మార్కెట్లోకి ప్రవేశపెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.


2011 నుంచి యుద్ధం, అంతర్జాతీయ ఆంక్షలు, ఆర్థిక అస్థిరత కారణంగా 99 శాతం విలువను కోల్పోయిన సిరియన్ పౌండ్‌పై నమ్మకాన్ని పునరుద్ధరించడమే ఈ కొత్త కరెన్సీ లక్ష్యం. ఇది స్థిరత్వం దిశగా ఒక అడుగుగా స్వాగతించినప్పటికీ, విస్తృత సంస్కరణలు లేకుండా, సవరించిన కరెన్సీ మాత్రమే ద్రవ్యోల్బణాన్ని అరికట్టలేదని లేదా కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచలేదని కొందరు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa