ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఉద్ధృతం.. నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల్లోకి ఉద్యమం

international |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 09:39 PM

ఇస్లామిక్ దేశం ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు నగరాల్లో ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణంపై సామాన్య ప్రజానీకం వారం రోజులు కిందట మొదలుపెట్టిన పోరాటం క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఈ క్రమంలో కొత్త ఏడాది వేళ నిరసనలు ఉద్ధృతమై హింసకు దారితీసి వందల మంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.


కాగా, ఇరాన్‌లో 2022 తర్వాత జరిగిన అతిపెద్ద నిరసనలు ఇవే. హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ ఇరాన్ మోరల్ పోలీసులు.. 22 ఏళ్ల మహసా అమీనిని అరెస్ట్ చేయగా.. ఆమె కస్టడీలో ఉండగా చనిపోయారు. దీంతో యువతలో ఆవేశం కట్టలు తెంచుకుని, వీధుల్లోకి వచ్చి హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలకు అంతర్జాతీయంగా ప్రముఖలు, సెలబ్రిటీల నుంచి మద్దతు లభించింది.


టెహ్రాన్ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి ‘ముల్లాహ్‌లు దిగిపోవాలి’ ‘సర్వాధికారికి మరణం’ అంటూ నినదించారు. ‘ముల్లాహా్ సమాధి కప్పే వరకూ ఈ మాతృభూమికి స్వేచ్ఛ లభించదు.. ‘"ముల్లాహ్‌లు ఇరాన్‌ను విడిచి వెళ్ళాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1979లో ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్‌ను పాలించిన షా మహమ్మద్ రెజా కుమారుడు పహ్లావీ రెజా పహ్లావీకి ఆందోళనకారులు మద్దతు తెలపడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాలో ప్రవాసం గడుపుతోన్న రెజా పహ్లావీ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ ‘మన పోరాటం న్యాయమైంది కాబట్టి మనదే విజయం’ అంటూ నిరసనకారులకు సంఘీభావం తెలిపారు.


అమెరికా డాలర్ విలువతో పోల్చితే ఇరాన్ కరెన్సీ రియాద్ విలువ సగానికి పడిపోవడం, ద్రవ్యోల్బణం ఏకంగా 42.5 శాతానికి చేరడంతో పౌరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డిసెంబరు 27న మొదటిసారి పలు నగరాల్లోని దుకాణదారులు వీధుల్లోకి వచ్చారు. ఇందులో ప్రజలు భాగస్వాములుగా చేరడంతో ఉద్యమం మలుపుతిరిగింది. లోర్డెగాన్, కుహదాష్త్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. కుహదాష్త్‌లో బాసిజ్ పారామిలటరీ బలగాలకు చెందిన అమీర్ హొస్సామ్ ఖోదయారీ ఫర్ద్ అనే అధికారి చనిపోగా.. మరో 13 మంది గాయపడ్డారు.


పరిస్థితి చేజారుతుండటంతో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒకవైపు నిరసనలు అదుపుచేయడానికి చర్యలు చేపడుతూనే, ఇంకోవైపు చర్చలకు సిద్ధమని ప్రకటించింది. వర్తక సంఘాల ప్రతినిధులతో నేరుగా చర్చిస్తామని ఇరాన్ అధికార ప్రతినిధి ఫాతిమా మొహజెరానీ ప్రకటన చేశారు. అయితే, ఉద్యమాన్ని అణచివేయడానికి కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. అలాగే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై 30 మంది అనుమానితులను టెహ్రాన్‌లో అదుపులోకి తీసుకుంది. భద్రత, నిఘా వర్గాల సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa