వెనుజులా తర్వాత అత్యంత కీలకమైన గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని భావిస్తోన్న అమెరికా.. అందుకోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా డబ్బులతో గ్రీన్లాండ్ వాసులకు ఎరవేసి.. తమవైపు తిప్పుకోవాలని వైట్‌హౌస్ యోచిస్తోంది. అక్కడకు ప్రజలకు ఒక్కొక్కరికి 10,000 నుంచి 100,000 డాలర్లు వరకు ఆఫర్ చేసి, డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాలో చేరమని ఒప్పించాలని భావిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేసే అమెరికా ప్రయత్నాలలో ఈ ప్రతిపాదన ఒకటి. కానీ, డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వాలు తమ భూభాగం అమ్మకానికి లేదని స్పష్టం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆక్రమిస్తే సైనికులు ఆదేశాల కోసం వేచి చూడకుండానే కాల్పులు జరుపుతారని డెన్మార్క్ హెచ్చరించింది.
నేరుగా డబ్బు ఇవ్వడం అనేది 57,000 జనాభా కలిగిన ఈ ద్వీపాన్ని "కొనుగోలు" చేయడానికి అమెరికా అనుసరించగల ఒక మార్గంగా తెలుస్తోంది. అయితే, ఇది గ్రీన్లాండ్ ప్రజలను అవమానించేలా, కేవలం వ్యాపార లావాదేవీలా మారే ప్రమాదం ఉంది. గ్రీన్‌ల్యాండ్ ప్రజలు చాలా కాలంగా స్వాతంత్ర్యం గురించి, డెన్మార్క్‌పై ఆర్థికంగా ఆధారపడటం గురించి పునరాలోచన చేస్తున్నారు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాలనే ట్రంప్ ప్రయత్నాల నేపథ్యంలోనే ఈ వార్తలు వచ్చాయి. అమెరికా సైనిక బలగాలను ఉపయోగించి కూడా ఆ దీవిని పొందవచ్చని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు.
దీనిపై గ్రీన్లాండ్ ప్రధాన మంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ఫేస్బుక్లో ‘ఇక చాలు... ఆక్రమణ గురించిన ఊహలకు స్వస్తి పలకాలి’ అని పోస్ట్ చేశారు. గ్రీన్లాండ్లో అపార ఖనిజ సంపద ఉందని, ఇది అధునాతన సైనిక ఆపరేషన్లకు అవసరమని ట్రంప్ వాదిస్తున్నారు. అంతేకాకుండా, పశ్చిమార్ధగోళం మొత్తం అమెరికా భౌగోళిక రాజకీయ కనుసన్నల్లో ఉండాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. ‘జాతీయ భద్రతా దృష్ట్యా మనకు గ్రీన్లాండ్ అవసరం, డెన్మార్క్ దానిని నిర్వహించలేదు. ఇది చాలా వ్యూహాత్మకమైనది’ అని ట్రంప్ అన్నారు.
గ్రీన్‌లాండ్‌ను ఎలా సొంతం చేసుకోవాలనే దానిపై ట్రంప్ యంత్రాంగం చర్చలు జరిపినప్పటికీ, వెనిజులాపై ఆపరేషన్ తర్వాత ఈ ప్రయత్నాలకు మరింత ఊపు వచ్చిందని సమాచారం. మదురోను విజయవంతంగా పట్టుకున్న తర్వాత ఇతర దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ లక్ష్యాలను సాధించడానికి ఇదే తరహా దూకుడుతో అధ్యక్షుడు ట్రంప్ ముందుకెళ్లాలని వైట్ హౌస్ అధికారులు కోరుతున్నారు.
గ్రీన్లాండ్ ప్రజలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ ప్రతిపాదనలు కొత్తది కానప్పటికీ ఇటీవల ఈ చర్చలు మరింత తీవ్రమయ్యాయని, ఒక్కొక్కరికి 100,000 డాలర్లు చొప్పున అంటే దాదాపు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 530-540 కోట్లు) చెల్లించే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు. అయితే, ఈ మొత్తం ఎప్పుడు? ఎలా చెల్లిస్తారు? ప్రజల నుంచి ఏం ఆశిస్తారు? అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. డెన్మార్క్ హెచ్చరించినప్పటికీ సైనిక జోక్యం సాధ్యమేనని వైట్‌హౌస్ చెబుతోంది. అయితే, ద్వీపాన్ని కొనుగోలు చేయడం లేదా దౌత్య మార్గాల ద్వారా పొందడం తమ ప్రాధాన్యత అని అధికారులు తెలిపారు.
మరో ప్రతిపాదనగా కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్" అనే ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ అధికారులు యోచిస్తున్నారు. ఈ ఒప్పందాలు మైక్రోనేషియా, మార్షల్ దీవులు, పలావు వంటి చిన్న దేశాలతో మాత్రమే జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం.. గ్రీన్లాండ్కు మెయిల్ డెలివరీ, సైనిక రక్షణ వంటి సేవలను అమెరికా అందిస్తుంది. దీనికి బదులుగా అమెరికా సైన్యం స్వేచ్ఛగా తిరగడానికి, వాణిజ్యం సుంకాలు లేకుండా జరగడానికి అనుమతి లభిస్తుంది.
కానీ, ఈ కొఫొ ఒప్పందాలు స్వతంత్ర దేశాలతో మాత్రమే జరుగుతాయి... కాబట్టి డెన్మార్ నుంచి గ్రీన్లాండ్ విడిపోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంలో చేరడానికి లేదా స్వాతంత్ర్యం కోసం ఓటువేసేలా అక్కడ ప్రజలను ప్రోత్సహించడానికి డబ్బు ఎరగా వేయాలని అనుకుంటున్నారు..వాళ్లు స్వాతంత్ర్యం కోరుకుంటున్నప్పటికీ, ఆర్థిక సమస్యల కారణంగా చాలా మంది శాసనసభ్యులు రెఫరెండంకు పిలుపునివ్వడం లేదు. చాలా మంది గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్ నుంచి విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అమెరికాలో భాగం కావడానికి ఇష్టపడటం లేదని సర్వేలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa