వైవాహిక బంధం నుంచి విడిపోయిన మహిళల భద్రత, జీవనోపాధిపై అలహాబాద్ హైకోర్టు మంగళవారం ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న భార్యకు, భర్త తన నికర ఆదాయంలో 25 శాతం వరకు భరణంచెల్లించాల్సిందేనని జస్టిస్ మదన్ పాల్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఒక భర్త దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన పెంపు ఉత్తర్వులను సమర్థించింది.
అసలేమిటి ఈ కేసు?
ఈ వివాదం షాజహాన్పూర్కు చెందిన సురేష్ చంద్ర, అతని భార్యకు సంబంధించింది. 2003లో వీరు విడిపోయినప్పుడు.. ట్రయల్ కోర్టు భార్యకు నెలకు రూ. 500 భరణం చెల్లించాలని ఆదేశించింది. అయితే మారుతున్న కాలం, పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా.. తన భరణాన్ని పెంచాలని కోరుతూ భార్య 2015లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు జూలై 2024లో ఆమె భరణాన్ని రూ. 500 నుంచి రూ. 3,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
భర్త వాదన ఏంటంటే..?
ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సురేష్ చంద్ర హైకోర్టును ఆశ్రయించారు. తాను కేవలం ఒక సామాన్య కూలీనని, అతి కష్టం మీద జీవనం సాగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆరు సార్లు భరణం పెంచారని.. నెలకు రూ. 3,000 చెల్లించడం తన స్యికి మించిన భారమని కోర్టుకు వివరించారు. అయితే సురేష్ చంద్ర వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యను పోషించడం అనేది భర్తకు రాజ్యాంగబద్ధమైన చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని.. అది ఒక పవిత్రమైన ధర్మం అని పేర్కొంది.
భర్తకు ఎలాంటి శారీరక వైకల్యం లేదని.. అతను ఆరోగ్యవంతుడని కోర్టు గుర్తించింది. పని చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తి తన బాధ్యత నుండి తప్పించుకోలేడని పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను ఉదహరిస్తూ.. ఒక కూలీ రోజుకు కనీసం రూ. 600 సంపాదిస్తాడని.. నెలకు రూ. 18,000 ఆదాయం వస్తుందని అంచనా వేసింది. దీని ప్రకారం 25 శాతం అంటే రూ. 4,500 వరకు భరణం ఇవ్వవచ్చని, కానీ ఫ్యామిలీ కోర్టు కేవలం రూ. 3,000 మాత్రమే ఇవ్వాలని చెప్పిందని తెలిపింది. ఇది ఏమాత్రం ఎక్కువ కాదని తేల్చి చెప్పింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం దృష్ట్యా రూ. 3,000 అనేది కనీస అవసరాలకు కూడా సరిపోదని.. దీనిని అధికం అనడం సమంజసం కాదని కోర్టు పిటిషన్ను కొట్టివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa