ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తలమునకలై ఉన్నారు. దావోస్ పర్యటన మూడో రోజున ఆయన ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకురావడమే లక్ష్యంగా జరిపిన ఈ చర్చలు ఫలవంతమయ్యాయి. ముఖ్యంగా ఉక్కు, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులకు మార్గం సుగమం అయింది.దావోస్ లోని ఏపీ లాంజ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్ సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ నిర్మించ తలపెట్టిన భారీ ఉక్కు కర్మాగారం పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తొలి దశలోనే దాదాపు రూ. 60 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి వివిధ దశల్లో ఉన్న అనుమతులు, భూసేకరణ వంటి అంశాలపై లక్ష్మీ మిట్టల్ సమక్షంలోనే సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా అన్ని అనుమతులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి జాప్యం ఉండదని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని మంత్రులకు సీఎం సూచించారు. ప్లాంట్ పురోగతిని మంత్రి లోకేశ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆదిత్య మిట్టల్ ఈ సందర్భంగా ప్రశంసించారు.ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ 'తమారా లీజర్' సీఈవో సృష్టి శిబులాల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. పర్యాటక రంగ ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించామని, పెట్టుబడులకు ఏపీ ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోనూ, కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లోనూ అద్భుతమైన టూరిజం కేంద్రాలను అభివృద్ధి చేయవచ్చని సూచించారు. రాష్ట్రంలోని ప్రతీ పర్యాటక ప్రాంతానికి రోడ్లు, విమానాశ్రయాల కనెక్టివిటీ ఉందని, హోటల్ రంగానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు. పర్యాటకం ద్వారా స్థానిక ఆర్ధిక వ్యవస్థ బలపడటంతో పాటు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని సీఎం వివరించారు.ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై తమారా లీజర్ సంస్థ సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పర్యావరణ హితమైన 'ఎకో-టూరిజం' పార్కులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశాఖపట్నం సహా ఇతర ప్రాంతాల్లో 'హోమ్ స్టే' ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. 'కమ్యూనిటీ ఫస్ట్' అనే నినాదంతో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారిని కూడా ఈ ప్రాజెక్టులలో భాగస్వాములను చేస్తామని సీఎంకు వివరించారు. సరైన ప్రతిపాదనలతో వస్తే పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.టెక్నాలజీ రంగంలోనూ ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో కాలిబో ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు రాజ్ వట్టికూటి, సీఈవో స్కాట్ శాండ్స్ఛఫెర్ తో సీఎం చర్చలు జరిపారు. ఇప్పటికే వట్టికూటి ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమరావతిలో ఏఐ అకాడెమీ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు కూడా విస్తరించి, మరింత మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సీఎం ప్రతిపాదించారు. విశాఖపట్నం మధురవాడలోని ఐటీ సెజ్ లో ఒక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కాలిబో సంస్థను చంద్రబాబు ఆహ్వానించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa