ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.78 లక్షల మెడికల్‌ బిల్లు రూ.21.4 లక్షలకు తగ్గింది.. ఏఐని ఇలా కూడా వాడొచ్చా

national |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 09:17 PM

ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఏఐ టెక్నాలజీతో రోజురోజుకూ అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పేదలు కాదు.. కనీసం మధ్య తరగతి వాళ్లు కూడా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. కార్పొరేట్ హాస్పిటల్స్ లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ వ్యాధి నయం అవుతుందో లేదో అనే పరిస్థితి ఉంది. అయితే ఆస్పత్రి బిల్లులు సామాన్యుడికి గుండెపోటు తెప్పిస్తున్న ఈ రోజుల్లో.. ఒక కుటుంబం ఏఐని ఉపయోగించి ఏకంగా రూ.56 లక్షల ఆసుపత్రి ఖర్చును తగ్గించుకున్న వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఏఐ అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదని.. అన్యాయమైన వ్యవస్థలపై పోరాడే ఒక శక్తివంతమైన ఆయుధం అని ఈ ఘటన నిరూపించింది. ఒక వ్యక్తి అనారోగ్యం బారిన పడటంతో.. అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ 10 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. అయితే ఆ 10 రోజులకు ఆ ఆస్పత్రి ఏకంగా రూ.78 లక్షల బిల్లు వేసింది. అందులో ఎలాంటి కొత్త చికిత్సలు లేకపోగా.. ఆ బిల్లు చూసి బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. సాధారణంగా అయితే ఇలా అధికంగా బిల్లు వేస్తే.. వారిపై పోరాడేందుకు లాయర్లను ఆశ్రయిస్తాం. లేకపోతే ఆస్పత్రి యాజమాన్యం వద్దకు వెళ్లి బతిమాలుతాం.


కానీ ఆ కుటుంబం మాత్రం తెలివిగా ఆలోచించి.. ఏఐ సహాయం తీసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ప్రతీ మెడికల్ బిల్లును, అందులోని ప్రతీ లైన్‌ను ఏఐ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసి.. ఆ మొత్తం మెడికల్ బిల్లును ఆడిట్ చేయాలని కోరింది. దానికి సరైన రీతిలో ప్రాంప్టింగ్ ఇచ్చింది. క్షణాల్లో ఆ బిల్లులోని లోపాలను ఏఐ గుర్తించి బయటపెట్టింది. డూప్లికేట్ ఛార్జీలు, కోడ్ స్టాకింగ్, కన్జ్యూమబుల్స్ పేర్లతో రూ.లక్షలు అధికంగా బిల్లు వేశారని తేలింది. ఒకేదానికి రెండుసార్లు బిల్లు వేయడం.. నిబంధనల ప్రకారం కాకుండా చికిత్సలకు వేర్వేరుగా వేసి బిల్లును పెంచేందుకు ప్రయత్నించారు. ఇక ఆ పేషంట్‌కు ఉపయోగించని వస్తువులకు కూడా అధిక ధరలు వేసినట్లు ఏఐ వెల్లడించింది.


అవన్నీ పూర్తి అయిన తర్వాత.. చట్టపరమైన నిబంధనలను ప్రస్తావిస్తూ ఏఐ ఒక అధికారిక లేఖను కూడా సిద్ధం చేసి ఇచ్చింది. ఆ లెటర్‌ను చూసిన ఆస్పత్రి యాజమాన్యం అవాక్కయింది. దాన్ని మొత్తం చదివి.. బిల్లును మొత్తం పరిశీలించింది. 3 రోజుల తర్వాత సవరించిన బిల్లును పంపించింది. మొదట రూ.78 లక్షలు వేసిన ఆ మెడికల్ బిల్లును ఏకంగా రూ.21.4 లక్షలకు తగ్గిస్తూ ఫైనల్ బిల్లు ఇచ్చింది. దీంతో ఆ కుటుంబానికి రూ.56 లక్షలు అధికంగా చెల్లించే బాధ తప్పింది.


అయితే ఇలాంటిదే ఒక సంఘటన గతేడాది నవంబర్‌లో అమెరికాలో జరిగింది. ఒక వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆ హాస్పిటల్ ఏకంగా రూ.1.73 కోట్ల భారీ మెడికల్ బిల్‌ వేయడం చూసి వాళ్లు షాక్ అయ్యారు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో అంత బిల్లు కట్టడం అసాధ్యమని భావించిన వారు.. 'క్లాడ్' అనే ఏఐ చాట్‌బాట్ సాయం తీసుకున్నారు. ఆ బిల్లును అందులో అప్‌లోడ్ చేయగా.. ఏఐ ఆస్పత్రి చేసిన మోసాలను బయటపెట్టింది. ఒకే చికిత్సకు వేర్వేరు పేర్లతో డూప్లికేట్ బిల్లులు వేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఛార్జీలు వసూలు చేయడం వంటి అంశాలను ఏఐ గుర్తించింది. ఏఐ అందించిన చట్టపరమైన ఆధారాలతో ఆ కుటుంబం ఆస్పత్రిని నిలదీయగా.. మేనేజ్‌మెంట్ దిగివచ్చింది. దీంతో ఆ బిల్లు ఏకంగా రూ.30 లక్షలకు తగ్గింది. దీంతో ఆ కుటుంబం దాదాపు రూ.1.40 కోట్లు ఆదా చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa