అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న వైరం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తనను హతమార్చేందుకు ఇరాన్ కుట్ర పన్నుతోందనే వార్తలు ఎక్కువవుతున్న క్రమంలో.. ట్రంప్ ఆ దేశానికి అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ తనపై దాడికి ప్రయత్నిస్తే.. ఆ దేశాన్ని భూమి మీదే లేకుండా తుడిచి పెట్టాలని తన అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
అణువణువూ నాశనం చేస్తాం: ట్రంప్
ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. "నాకు చాలా స్పష్టమైన సూచనలు ఉన్నాయి. నాకు ఏమైనా జరిగితే.. ఇరాన్‌ను ఈ భూమి మీద నుంచి తుడిచి పెట్టేయండి అని నా సైనిక సలహాదారులకు చెప్పాను" అని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఒక రోగిగా అభివర్ణించిన ట్రంప్.. ఇరాన్‌కు కొత్త నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి జనరల్ అబుల్ ఫజల్ షేకర్చి ధీటుగా స్పందించారు. "మా నాయకుడిని ఎవరైనా తాకాలని చూస్తే.. ఆ చేతిని నరకడమే కాదు వారి ప్రపంచాన్నే పూర్తిగా తగులబెడతాం" అని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా యుద్ధ వాతావరణానికి దారితీస్తోంది.
గత ఏడాది కాలంగా ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభంపై జరుగుతున్న నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం.. ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 4,519 మంది పౌరులు మరణించారు. సుమారు 26,300 మందిని ఇరాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఈ మరణాలకు అమెరికానే కారణమని ఖమేనీ ఆరోపిస్తుండగా.. శాంతియుత నిరసనకారులను చంపడం సరికాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే కొనసాగితే.. తమ దేశం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
ఇరాన్ దిశగా.. అమెరికా యుద్ధనౌక
అయితే తాజా ఉద్రిక్తతల మధ్య అమెరికా తన భారీ యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను.. ఇరాన్ దిశగా మళ్లించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఈ విమాన వాహక నౌక.. మూడు డిస్ట్రాయర్లతో కలిసి హిందూ మహాసముద్రం మీదుగా మిడిల్ ఈస్ట్ వైపు దూసుకుపోతోంది. ఇది మరికొద్ది రోజుల్లోనే పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అమెరికా సైనిక కదలికలు చూస్తుంటే ఇరాన్‌లో ఏ క్షణమైనా, ఏమైనా జరగవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa