ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఇన్నాళ్ల పాటు బంగ్లాదేశ్ ఆడుతుందా? లేదా? అన్న అనుమానాలకు ముగింపు పడింది. భారత్‌కు వెళ్లి టోర్నీలో ఆడేందుకు నిరాకరిస్తే, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకునేందుకు ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు ఐసీసీ మరో ఒక రోజు మాత్రమే గడువు ఇచ్చింది.
బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ తన వైఖరి మార్చుకోకుండా భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే, ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేయాలనే ప్రతిపాదనకు మెజార్టీ డైరెక్టర్లు మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న 15 మంది డైరెక్టర్లలో పాకిస్తాన్ మాత్రమే బీసీబీకి మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి ఐసీసీ చైర్మన్ జై షా సహా అన్ని ఫుల్ మెంబర్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ తదితర దేశాల కీలక ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని అన్ని స్వతంత్ర భద్రతా అంచనాలు స్పష్టం చేశాయని పేర్కొంది. ఆటగాళ్లు, అధికారులు, మీడియా ప్రతినిధులు, అభిమానులకు కూడా ప్రమాదం లేదని నివేదికలు తెలిపినట్లు వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీ ప్రారంభానికి ఇంత దగ్గరగా షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదని ఐసీసీ స్పష్టం చేసింది.
భద్రతా కారణాలు లేకుండా మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చితే, భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల నిర్వహణకు ఇబ్బందికరంగా మారుతుందని ఐసీసీ అభిప్రాయపడింది. బీసీబీతో గత కొన్ని వారాలుగా విస్తృతంగా చర్చలు జరిపామని భద్రతా ప్రణాళికలు, హోస్ట్ దేశ హామీలను పూర్తిగా వివరించినప్పటికీ బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిపింది.
జనవరి 4న బంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ కలిసి భారత్‌కు జట్టు పంపబోమని ఐసీసీకి లేఖ రాయడంతో ఈ వివాదం మొదలైంది. ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలంటూ బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీబీ పేర్కొంది. అయితే ఐసీసీ మాత్రం ఈ అంశానికి వరల్డ్ కప్ భద్రతకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్ తమ గ్రూప్‌ను ఐర్లాండ్‌తో మార్చి శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ గ్రూప్ సీలో ఉంది. ఫిబ్రవరి 7, 9, 14 తేదీల్లో కోల్‌కతాలో, ఫిబ్రవరి 17న ముంబైలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ కనిపించే అవకాశం చాలా ఎక్కువగా మారింది. ఐసీసీ ఇచ్చిన చివరి గడువు తర్వాతే ఈ వివాదానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa