ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేపట్టిన 'ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ' కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఇది భారతీయ కుటుంబ విలువలకు అద్దం పడుతోందని, కుటుంబ బంధాలను బలోపేతం చేసే గొప్ప చొరవ అని కొనియాడారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థలకు లభిస్తున్న గౌరవాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.ఈ సందర్భంగా ప్రధాని గుజరాత్‌లోని చందంకి గ్రామంలో ఉన్న ఓ ప్రత్యేక సంప్రదాయాన్ని ఉదహరించారు. ఆ గ్రామంలోని ప్రజలు, ముఖ్యంగా పెద్దవారు తమ ఇళ్లలో వంట చేయరని, గ్రామంలోని సామూహిక వంటశాల ద్వారా అందరూ కలిసి భోజనం చేస్తారని వివరించారు. ఈ విధానం ప్రజల మధ్య ఐక్యతను, కుటుంబ భావనను పెంపొందిస్తోందని మోదీ అన్నారు.ఇటీవల భారత పర్యటనకు వచ్చిన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్‌తో జరిగిన సంభాషణను ప్రధాని గుర్తు చేసుకున్నారు. 2026వ సంవత్సరాన్ని యూఏఈ 'ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ'గా ప్రకటించిందని ఆయన తనతో చెప్పినట్లు మోదీ తెలిపారు. ప్రజల మధ్య సామరస్యం, సామాజిక ఐక్యతను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని యూఏఈ అధ్యక్షుడు వివరించినట్లు పేర్కొన్నారు.యూఏఈ చేపట్టిన ఈ కార్యక్రమం నిజంగా ప్రశంసనీయమని మోదీ పేర్కొన్నారు. ఇటువంటి సామాజిక, సాంస్కృతిక విలువలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం భారత్-యూఏఈ బలమైన సంబంధాలకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరాన్ని 'కుటుంబ సంవత్సరం' (ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ)గా పాటిస్తున్నట్లు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. అబుదాబిలో జరిగిన 2025 వార్షిక ప్రభుత్వ సమావేశాల సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. దేశ భవిష్యత్తు, సుస్థిరతకు కుటుంబ వ్యవస్థే పునాది అని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది.ఎమిరేటీ కుటుంబాల శ్రేయస్సు, స్థిరత్వం, బలోపేతమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అధ్యక్షుడు స్పష్టం చేశారు. బలమైన, సుస్థిరమైన కుటుంబాలే దేశ దీర్ఘకాలిక ప్రగతికి ఆధారం అని, కుటుంబ వృద్ధి జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన పేర్కొన్నారు. దేశ జాతీయ గుర్తింపు, భద్రత, సమృద్ధిలో కుటుంబ శ్రేయస్సు అంతర్భాగమని నొక్కిచెప్పారు. ఐక్యత, సహకారం, సానుభూతి వంటి విలువలను ప్రోత్సహించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించడం కూడా ఈ కార్యక్రమ లక్ష్యాల్లో ఒకటి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa