అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత్ కుదుర్చుకున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో.. పాక్ అంతర్గతంగా తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటోంది. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి పాక్ పాలకులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని.. భారత్ తన ఆర్థిక బలంతో మెరుగైన ఫలితాలను సాధించిందని అక్కడి మేధావులు, రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలు సైతం భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు.
భారత్‌పై 18%, పాక్‌పై 19% సుంకాలు
భారత్-అమెరికా తాజా ఒప్పందం ప్రకారం.. భారతీయ ఎగుమతులపై అమెరికా తన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. కానీ అంతకు ముందే పాకిస్థాన్ పాలకులు.. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం, 'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయినప్పటికీ.. అమెరికా పాకిస్థాన్‌కు 19 శాతం సుంకాన్ని ఖరారు చేసింది. భారత్ కంటే ఒక శాతం ఎక్కువ సుంకం విధించడమే కాకుండా, తక్కువ గౌరవం దక్కడం పాక్ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.
పాక్ మాజీ మంత్రి హమ్మద్ అజహర్ స్పందిస్తూ.. ప్రస్తుత విదేశాంగ విధానం.. ఆర్థిక బలం, మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, కానీ పాలకులను ప్రస్నం చేసుకోవడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో వ్యవహరించిందని.. పాక్ మాత్రం వ్యక్తిగత సంబంధాల కోసం ప్రాకులాడిందని విమర్శించారు.
భారత్‌ను చూసి నేర్చుకోవాలంటున్న నెటిజెన్లు
మరోవైపు ప్రముఖ జర్నలిస్ట్ ఇమ్రాన్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ.. "మీరు బలూచిస్థాన్ ఖనిజాలను చెక్క పెట్టెల్లో పెట్టి అమెరికాకు ధారపోసినా సరే.. గౌరవాన్ని మాత్రం కొనుక్కోలేరు" అంటూ సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డిజిటల్ క్రియేటర్ వజహత్ ఖాన్ స్పందిస్తూ.. ట్రంప్ ఒక వ్యాపారవేత్త అని, ఆయన భారత్‌ను ఒక భాగస్వామిగా చూశారని, పాకిస్థాన్‌ను కేవలం ఒక దుకాణదారుడిగా మాత్రమే పరిగణించారని విశ్లేషించారు. సోషల్ మీడియా వేదికగా పాక్ ప్రజలు సైతం ఇలాగే మాట్లాడుతూ.. భారత్‌ను చూసి నేర్చుకోవాలటూ హితవు పలుకుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa