ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూనస్ నివాసం వద్ద ఘర్షణలు,,,,బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తతలు

international |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 09:48 PM

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం తొమ్మిదో పే కమిషన్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ నివాసం ‘జమునా’ ముందు ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మరో ఆరు రోజుల్లో బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఘర్షణలు జరగడం గమనార్హం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలతో ఆగస్టు 2024లో ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భారత్‌కు పారిపోయివచ్చారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాడింది. ఏడాదిన్నర అనంతరం బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఆ దేశంలో హిందువులపై లక్షిత దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.


తొమ్మిదో పే కమిషన్‌ను అమలు చేయాలని కోరుతూ. శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్ నలుమూలల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఢాకాకు తరలివచ్చి షాహీద్ మీనార్ వద్ద సమావేశమై.. ‘జమునా’కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ‘కడుపు అన్నం లేకపోతే.. నోటిలో ఏ అభివృద్ధి ఉంది?’ వంటి నినాదాలు చేస్తూ, నిరసనకారులు ప్రభుత్వం తమ జీవనోపాధి సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. ఈ క్రమంలో ఉదయం 11.30 గంటలకు షాబాగ్ వద్ద బారికేడ్లను ధ్వంసం చేసి యూనస్ నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని, వారిని నిలువరించడానికి వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, సౌండ్ గ్రనేడ్లను ఉపయోగించారు. అప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో లాఠీఛార్జ్ చేశారు. నిరసనకారులను అడ్డుకోడానికి పారామిలటరీ బలగాలను కూడా రప్పించారు. దీంతో భద్రతా సిబ్బంది, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో పలువురు గాయపడ్డారు.


‘ఎన్నికల ప్రక్రియను అడ్డుకోడానికే మీరు జమునాకు వచ్చారా?’ అని డిప్యూటీ కమిషనర్ మసూద్ ఆలం నిరసన తెలుపుతున్న అధికారిని ప్రశ్నించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పోలీసు చర్య కొనసాగితే తీవ్రమైన రాజకీయ పరిణామాలు ఉంటాయని ప్రభుత్వ ఉద్యోగులు హెచ్చరించారు.‘దాడులు కొనసాగితే మేము ఎన్నికలను బహిష్కరిస్తాం’ అని నిరసనకారులు అన్నారు. అనంతరం పోలీసులు.. పరిస్తితిని అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటన్నామని, ఈ ప్రాంతం నుంచి వెళ్లాలని నిరసనకారులతో చర్చలు జరుపుతున్నట్టు ఆలం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa