భారత సైన్యం మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె రచించిన ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ వివాదంలో చిక్కుకున్న విషంయ అందరికీ తెలిసిందే. ఈ పుస్తకంపై రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలోనే.. ప్రచురణ సంస్థ 'పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా' కీలక ప్రకటన చేసింది. ఈ పుస్తకం ఇప్పటి వరకు అటు ముద్రణ రూపంలో కానీ, ఇటు డిజిటల్ రూపంలో కానీ అధికారికంగా విడుదల కాలేదని స్పష్టం చేసింది. దీంతో మరి ఈ పుస్తకం రాహుల్ గాంధీ చేతిలోకి ఎలా వచ్చింది? దీనిపై సదరు సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాపీరైట్ ఉల్లంఘనపై 'పెంగ్విన్' సీరియస్
పెంగ్విన్ సంస్థ తన వివరణలో అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేసింది. "నరవణె పుస్తక ప్రచురణ హక్కులు కేవలం మాకే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మేం ఒక్క కాపీని కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో లేదా పీడీఎఫ్ రూపంలో చక్కర్లు కొడుతున్న కాపీ అక్రమమైనది. ఇది కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇలాంటి అనధికారిక ప్రతులను పంపిణీ చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం" అని సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
పెంగ్విన్ ప్రకటనను బట్టి.. పరోక్షంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు అర్థం అవుతోంది. ఎందుకంటే ఆయన ఈ పుస్తకాన్ని నేరుగా పార్లమెంటుకు తీసుకు వచ్చి రచ్చ చేశారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని సభకు తీసుకురాగా.. రక్షణ శాఖ అనుమతి నిరాకరించిన పుస్తకాన్ని రాహుల్ ఎలా తెచ్చారని అధికార పక్షం ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానం చెప్పని రాహుల్ గాంధీ.. తాను దీనిని ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తానని సభలో చెప్పగా.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది.
రంగంలోకి ఢిల్లీ పోలీసులు.. ఎఫ్‌ఐఆర్ నమోదు
పుస్తకం ఇంకా ప్రచురణ కాకముందే దానికి సంబంధించిన పీడీఎఫ్ ప్రతులు కొన్ని వార్తా సంస్థల వెబ్‌సైట్లలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దర్శనమివ్వడాన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రచురణకు ముందు సిద్ధం చేసిన ముసాయిదా ప్రతిని ఎవరో అనధికారికంగా వెలుగులోకి తెచ్చారని ప్రాథమికంగా గుర్తించారు.
ఈ పుస్తకంపై వివాదం ఎందుకు?
భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయ ఘర్షణలు, అగ్నిపథ్ పథకం రూపకల్పన వంటి అంశాలపై నరవణె తన పుస్తకంలో నిర్మొహమాటంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. దేశ భద్రత దృష్ట్యా ఇవి బహిర్గతం కావడం సరికాదని రక్షణ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పుస్తకం ఇంకా 'సెన్సార్' ప్రక్రియలో ఉండగానే ఇలా బయటకు రావడం సంచలనంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa