చైనా సరిహద్దుల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారతంలో ఏర్పాటైన మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న C-130J విమానం ల్యాండ్ అయ్యింది. అసోంలోని మోరేన్ జాతీయ రహదారిపై ఈ ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఇది చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అసోంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మోదీ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం 37వ నెంబరు జాతీయ రహదారి దిగింది. చెబువా ఎయిర్‌పోర్ట్ నుంచి మోరెన్ ఈఎల్ఎఫ్‌కు ప్రధాని సీ-130జే విమానంలోనే చేరుకున్నారు.
అంతకు ముందు ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ ‘‘ELF అత్యవసర ప్రతిస్పందనకు చాలా కీలకమని, సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను సకాలంలో చేపట్టడానికి వీలు కల్పిస్తుంది’’ అని అన్నారు. రూ. 100 కోట్లతో మోరెన్ జాతీయ రహదారిపై 4.2 కి.మీ. మేర దీనిని ఏర్పాటుచేశారు. యుద్ధ విమానాలు, రవాణా విమానాలకు వ్యూహాత్మక రన్‌వేగా ఇది పనిచేస్తుంది. రక్షణ, లాజిస్టిక్స్‌తో పాటు విపత్తుల సమయంలో ప్రతిస్పందనను బలోపేతం చేస్తుంది. పౌర, సైనిక వినియోగం కోసం ఏర్పాటైన ఈ ఫెసిలిటీ.. అత్యవసర పరిస్థితుల్లో దిబ్రుగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా సేవలు అందిస్తుంది. 40 టన్నుల వరకు యుద్ధ విమానాలను, గరిష్టంగా 74 టన్నుల వరకు రవాణా విమానాలను ఇది నిర్వహించగలదు. దేశంలోని మొదటి ELF 2021లో రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో ప్రారంభించారు.
ప్రధాని మోదీ విమానం ల్యాండైన తర్వాత 40 నిమిషాల పాటు తెజాస్, సుఖోయ్, రఫేల్, ఇతర యుద్ధ విమానాలతో ఎయిర్‌షో నిర్వహించారు. ఇక, అసోంలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. గువహటి, ఉత్తర గువహటి మధ్య బ్రహ్మపుత నదిపై నిర్మించిన వంతెనను మోదీ ప్రారంభిస్తారు. ఈ వంతెన అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తర, దక్షిణ గువహటి మధ్య ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రయాణ సమయం తగ్గనుంది. అలాగే, ఐఐఎం గువహటి తాత్కాలిక క్యాంపస్‌ను కూడా మోదీ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. గువహటిలో 100 ఎలక్ట్రికల్ బస్సులను మోదీ ప్రారంభించిన అనంతరం.. బీజేపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa