రాష్ట్రంలో కల్తీ మాఫియా పెరిగిపోయిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నీరు, కల్తీ పాలు, కల్తీ ఆహారం..ఏది చూసినా కల్తీనే కనిపిస్తోందన్నారు. శాసనమండలి మీడియా పాయింట్‌లో మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయనగరం నుంచి రాజమండ్రి వరకు, శ్రీకాకుళం నుంచి జగ్గయ్యపేట వరకు డయేరియా కేసులు పెరిగిపోయాయని తెలిపారు. డయేరియా ప్రభలిన ప్రతీసారి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా సోది కబుర్లు చెబుతోందని విమర్శించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని, ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేసిందన్నారు.కల్తీ పాల ఘటనలో ఆరుగురు మరణించారని, ఏడాదిన్నర బాబుకు 60 సార్లు డయాలసిస్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. తురకపాలెంలో 60 మంది చనిపోయినా ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నీటి కాలుష్యంపై నిరసన తెలిపినా పట్టించుకోలేదని, నిరసన చేసిన రోజే చర్యలు తీసుకుని ఉంటే ప్రాణనష్టం తప్పేదన్నారు. శ్రీకాకుళంలో వాటర్ లీకేజీ కారణంగా డయేరియా వచ్చిందని చెప్పడం దారుణమని, డ్రైనేజ్ కలిసిన నీటిని సరఫరా చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సంక్షేమ హాస్టళ్లలో కూడా విద్యార్థులు కలుషిత ఆహారంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి రాలేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పారు. వైయస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్లే పర్యవేక్షణ లోపించిందన్నారు. మరణాల తర్వాత పరిహారం ప్రకటించడం వల్ల ప్రాణాలు తిరిగి రావని మండిపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకోవద్దని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa