ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 27, 2026, 12:01 AM

దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు Directorate General of Civil Aviation (డీజీసీఏ) గుడ్ న్యూస్ తెలిపింది. విమాన టికెట్ల రీఫండ్ విధానంపై కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.టికెట్ బుక్ చేసిన తర్వాత 48 గంటల్లోపు రద్దు చేసుకుంటే అదనపు క్యాన్సిలేషన్ ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. అదే సమయంలో టికెట్‌లో తేదీ మార్పులు కూడా ఉచితంగా చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే, కొత్తగా ఎంచుకున్న తేదీకి టికెట్ ధర పెరిగి ఉంటే, ఆ వ్యత్యాసాన్ని ప్రయాణికుడే భరించాలి.కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ బుక్ చేసిన తర్వాత 48 గంటల పాటు ఎయిర్‌లైన్స్ ‘లుక్-ఇన్ ఆప్షన్’ ఇవ్వాలి. ఈ గడువులో ప్రయాణికులు ఎటువంటి అదనపు రుసుములు లేకుండా టికెట్ రద్దు చేయడం లేదా మార్పులు చేయడం సాధ్యం అవుతుంది. అలాగే, ఎయిర్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా బుక్ చేసిన టికెట్‌లో 24 గంటల్లోపు పేరులో మార్పులు చేసుకునే సదుపాయం కూడా కల్పించబడింది.ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసినా, రీఫండ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్ సంస్థదేనని డీజీసీఏ స్పష్టం చేసింది. రీఫండ్ మొత్తాన్ని 14 పని దినాల్లోపు చెల్లించాలి. అయితే దేశీయ విమానాల్లో ప్రయాణ తేదీకి 7 రోజులకు లోపు బుక్ చేసిన టికెట్‌కు ‘లుక్-ఇన్ ఆప్షన్’ వర్తించదు. అంతర్జాతీయ విమానాల విషయంలో ఈ గడువు 15 రోజులు.అదనంగా, ప్రయాణికుడు లేదా అదే పీఎన్‌ఆర్‌లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రయాణ తేదీన ఆసుపత్రిలో చేరితే రీఫండ్ లేదా క్రెడిట్ షెల్ సదుపాయం కోరవచ్చు. ఇతర అనారోగ్య లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, ఎయిర్‌లైన్ సంస్థలు ఏరోస్పేస్ మెడిసిన్ నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవచ్చని డీజీసీఏ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa