అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య భారత్‌లోని ఒక చిన్న గ్రామం ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఇరాన్‌ను దశాబ్దాల పాటు శాసించిన ఆధ్యాత్మిక నేతల మూలాలు ఉత్తర ప్రదేశ్‌లోని ఒక కుగ్రామంలో ఉన్నాయన్న వాస్తవం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరి ఆ ఊరేంటి దానికి ఖమేనీ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఉన్న కింటూర్ అనే గ్రామం ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఇరాన్ ఇస్లామిక్ విప్లవ రూపశిల్పి, ఆదేశ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ వ్యవస్థాపక పితామహుడు అయిన అయతొల్లా రుహొల్లా ముసావి ఖొమేనీ పూర్వీకుల నివాసం ఇదే కింటూర్ గ్రామం. షియా మత విజ్ఞానానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన ఈ గ్రామం నుంచే ఖమేనీ కుటుంబం తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఖమేనీ తాతగారైన సయ్యద్ అహ్మద్ ముసావి 19వ శతాబ్దం ప్రారంభంలో కింటూర్ గ్రామంలోనే జన్మించారు.
ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆయన తొలుత ఇరాక్‌లోని నజాఫ్‌కు వెళ్లారు. ఆ తర్వాత 1834లో ఇరాన్‌లోని ఖొమేన్ నగరంలో స్థిరపడ్డారు. అక్కడే స్థిరపడినప్పటికీ.. ఆయన తన భారతీయ మూలాలను ఎన్నడూ మర్చిపోలేదు. ఇరాన్ అధికారిక రికార్డుల్లో నేటికీ ఆయనను "హిందీ" (భారతదేశానికి చెందినవాడు) అనే బిరుదుతో వ్యవహరిస్తారు. ఒక శతాబ్దం తర్వాత ఇదే కుటుంబం ఇరాన్ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకుని.. 1979 విప్లవం ద్వారా దేశ చరిత్రనే మార్చివేసింది.
వారసత్వ సంక్షోభంలో ఇరాన్
1989లో ఖొమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన అలీ ఖమేనీ.. తన పూర్వీకుడి కంటే ఎక్కువ కాలం ఇరాన్‌ను పాలించారు. అయితే ఆయన మరణంతో ఇప్పుడు ఇరాన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తదుపరి సుప్రీం లీడర్‌ను ఎన్నుకునేందుకు 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ రంగంలోకి దిగింది. ముఖ్యంగా దేశంలో ప్రస్తుతం అధికార శూన్యత ఏర్పడకుండా ఇరాన్ ప్రభుత్వం.. రాజ్యాంగ నిబంధనల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన తాత్కాలిక కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa