ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ నుంచి వెళ్తుండగా శ్రీలంకలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి.. 101 మంది సిబ్బంది గల్లంతు

international |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 07:25 PM

ఇజ్రాయెల్-అమెరికాలతో యుద్ధం కొనసాగుతున్న వేళ శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక పై దాడి చోటుచేసుకుంది. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డెనాపై జరిగిన ఈ దాడిలో 100 మందికిపైగా గల్లంతు కాగా. మరో 32 మంది గాయపడ్డారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. దాడి అనంతరం నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ దాడి గురించి శ్రీలంక నేవీ అధికారి వెల్లడించారు. బుధవారం తమ ప్రాదేశిక జలాల్లో దక్షిణంగా 25 మైళ్ల దూరంలో ఇరాన్ యుద్ధ నౌక మునిగిపోయినట్టు లంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్ ధ్రువీకరించారు. నౌక మునిగిపోవడానికి గల కారణంపై వెంటనే ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు, కానీ గాయపడిన నావికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు హెరాత్ పార్లమెంటుకు వెల్లడించారు.


మొత్తం 180 మంది సిబ్బంది కూడి ఆ నౌక బుధవారం తెల్లవారుజామున ప్రమాద హెచ్చరిక జారీచేసింది. గల్లంతైన నావికుల కోసం గాలింపు కొనసాగుతున్నట్టు శ్రీలంక రక్షణ శాఖ తెలిపింది. మిగతావారు ఏమయ్యారో తెలియరాదని పేర్కొంది. శ్రీలంక యుద్ధ నౌకలు, విమానాలను రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయని, నౌక మునిగిపోవడానికి కారణం ఏంటో తెలియరాలేదని చెప్పారు. ఈ యుద్ధ నౌక విశాఖలో జరిగిన ఐఎఫ్ఆర్, అంతర్జాతీయ పరిక్రమ్‌లో పాల్గొని, ఫిబ్రవరి 17న ఇరాన్‌కు బయలుదేరిందని, ఇందులోని 150 మంది గల్లంతయ్యారని రాయిటర్స్ పేర్కొంది. శ్రీలంకలోని గాలే మీదుగా వెళ్తుండగా దాడి జరిగినట్టు తెలిపింది. ఈ నౌకకు రక్షణగా ఐరెస్ మక్రాన్, మరో నౌక వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా ఈ నౌక దక్షిణాఫ్రికా, బ్రెజిల్ పోర్టులకు కూడా వెళ్లింది.


ఇరాన్‌పై జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగానే ఈ నౌకపై బాంబు దాడి జరిగిందా? అని ప్రతిపక్ష సభ్యుడు ప్రశ్నించినా.. ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన రాలేదు. శ్రీలంక ప్రాదేశిక జలాలకు అనుగుణంగా తమ ఆపరేషన్ జరిగిందని, రాజధాని కొలంబోకు 115 కిలోమీటర్లు (70 మైళ్లు) దక్షిణంగా ఉన్న గాలెలోని ప్రధాన ఆసుపత్రికి 32 మంది ఇరానియన్ నావికులను తరలించామని నేవీ ప్రతినిధి బుద్ధిక సంపత్ తెలిపారు. కాగా, ఈ నౌకపై జలాంతర్గామితో దాడిచేసినట్టు నివేదికలు అందుతున్నాయి.


ప్రమాద హెచ్చరిక రావడంతో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా తాము స్పందించామని చెప్పారు. వేరే దేశానికి సంబంధించిన సైన్యం ఉండటంతో నేవీ, ఎయిర్‌ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ ఫుటేజీని విడుదల చేయడం లేదని తెలిపాయి. గాయపడిన ఇరానియన్లను గాలే ఆసుపత్రిలో చేర్చడంతో పోలీసులు భద్రతను పెంచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa