ఏపీ రాజధాని అమరావతిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న క్రికెట్ స్టేడియాన్ని ఏపీఎల్ (ఆంధ్రా ప్రీమియర్ లీగ్)కు ప్రధాన కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌తో కలిసి మంగళగిరి స్టేడియాన్ని పరిశీలించారు. ఈ ఏడాది జరిగే ఏపీఎల్ సీజన్-5 మొదటి మ్యాచ్ మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే విశాఖపట్నం, కడప ప్రాంతాల్లో ఈ ఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తామంటున్నారు.
ఈ క్రికెట్ స్టేడియాన్ని అధునాతంగా తీర్చిదిద్దుతామని.. అభివృద్ధి పనులు పూర్తిచేసి రాబోయే రోజుల్లో దేశవాళీ సహా ఇతర మ్యాచ్‌లు నిర్వహించేలా సిద్ధం చేస్తామని తెలిపారు. మంగళగిరి క్రికెట్ స్టేడియం రూపురేఖలు మరో రెండు నెలల్లో మారిపోతాయంటున్నారు. స్టేడియంలో ప్లేయర్స్ కోసం అవసరమైన గదులు నిర్మిస్తున్నామన్నారు. అలాగే డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్నారు కేశినేని శివనాథ్, సానా సతీష్.
మంగళగిరి స్టేడియం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కు ప్రధాన కేంద్రంగా మారునుంది. 2026 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ - 5 త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానుంది... విశాఖపట్నం, మంగళగిరి, కడప స్టేడియాలలో మ్యాచులు జరగనున్నాయి. ఈరోజు మంగళగిరి స్టేడియాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు గారితో కలిసి పరిశీలించడం జరిగింది. మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని అధునాతన స్టేడియం గా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టాము. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-5 తొలి మ్యాచ్ ప్రారంభం నాటికి మంగళగిరి స్టేడియం ను ఆధునీకరించేందుకు ఈ రోజు పనులు ప్రారంభించడం జరిగింది. విశాఖపట్నం స్టేడియంలో 45 రోజుల్లో పూర్తిగా ఆధునికరించాం...అదేవిధంగా రానున్న రెండు నెలలలో, మే నెల నాటికి మంగళగిరి స్టేడియం ఆధునికరణ పనులు పూర్తి చేస్తాము. ఆధునీకరించిన స్టేడియంని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గార్ల చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాము' అంటూ కేశినేని శివనాథ్.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిజ క్రీడాకారులకు రిజర్వేషన్‌ను 2% నుంచి 3%కు పెంచామని.. డీఎస్సీ నియామకాలలో క్రీడాకోటా ద్వారా 420 పోస్టుల కేటాయించినట్లు అసెంబ్లీలో తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 800 మంది క్రీడాకారులకు ప్రయోజనం కలిగిందని.. క్రీడల అభివృద్ధికి రూ.24 కోట్లు కేటాయించామన్నారు. 9 క్రీడా వికాస కేంద్రాల (KVK) నిర్మాణం కొనసాగిస్తున్నామని.. కొత్త కేవీకే నిర్మాణానికి రూ.29 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు చేశామన్నారు. ఖేలో ఇండియా పథకం ద్వారా రూ.76 కోట్లు సమీకరించామన్నారు. CSR నిధుల ద్వారా అన్ని నియోజకవర్గాల్లో క్రీడలకు పెట్టుబడులు.. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. అమరావతిలో జాతీయ క్రీడల నిర్వహణకు కార్యాచరణ ప్రారంభించామని.. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో మూడు జోన్లుగా క్రీడాభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారుల అభ్యున్నతికి చర్యలు తీసుకున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa