ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘‘ట్రంప్, వారి కళ్లలోకి చూడు’’..టెహ్రాన్ టైమ్స్ ఫ్రంట్‌ పేజ్‌లో 160 మంది చిన్నారుల ఫోటోతో గుర్తుచేసిన ఇరాన్

international |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 07:31 PM

ఇరాన్ మద్దతు ఉన్న టెహ్రాన్ టైమ్స్ పత్రిక మొదటి పేజీలో.. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్- అమెరికా మొదటి రోజు జరిపిన దాడిలో మరణించిన ప్రాథమిక పాఠశాల చిన్నారుల ఫోటోను ‘‘ట్రంప్, వారి కళ్లలోకి చూడు’’..అనే శీర్షికతో ప్రచురించింది. ఇందులోని ప్రతి చిన్నారి క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 160 మంది బాలికలు చనిపోయిన ఘటన యావత్తు ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసిన సంగతి తెలిసిందే. ఆ 160 మంది చిన్నారులను ఇరాన్ ప్రభుత్వం ఒకే చోట ఖననం చేసింది.


దీనికి అనుగుణంగా సంపాదకీయం రాసిన టెహ్రాన్ టైమ్స్.. ‘‘ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు... తప్పుడు వాదనలు, జరిగిన దురాగాతలకు బాధ్యత నుంచి తప్పించుకోవడం.. దౌత్య పరిష్కారాలను ధిక్కరించే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి’’ ఆని ఆగ్రహం వ్యక్తం చేసింది. మినాబ్ పాఠశాలపై జరిగిన దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని, అది ఇరాన్ చేసిన పనేనంటూ ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. వారి ఆయుధాలు, మందుగుండు చాలా అస్థిరంగా ఉంటాయని, లక్ష్యాన్ని ఛేదించే కచ్చితత్వం వాటికి అస్సలు ఉండదని ఆరోపించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు, టెహ్రాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా రగులుతోంది.


ఈ వ్యాఖ్యల అనంతరం న్యూయార్క్ టైమ్స్ పరిశోధనలో దీనికి దాదాపు అమెరికా సైన్యమే కారణమని వెల్లడయ్యింది. అటు ఇజ్రాయెల్‌గానీ, అమెరికాగానీ ఈ దాడికి బాధ్యత వహించలేదు. దాడిలో కనీసం 160 మందికిపైగా బాలికలు చనిపోయినట్టు ఇరాన్ అధికారులు ప్రకటించారు. మినాబ్‌లోని సైనిక కాంపౌండ్‌పై ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా దాడులు జరిపాయి. ఆ కాంపౌండ్‌ పక్కనే ఉన్న పాఠశాలపై బాంబులు వర్షం కురవడంతో 165 మంది ప్రాణాలు కోల్పోయారు. టోమాహక్ క్రూయిజ్ క్షిపణితోనే పాఠశాలపై దాడి చేసినట్టు డచ్‌కు చెందిన ఫ్యాక్ట్ చెక్ బెల్లింగ్‌క్యాట్ రిసెర్చర్ ట్రవోర్ బాల్ తెలిపారు.


దీనికి సంబంధించి ఇరాన్ వార్త సంస్థ మెహర్ న్యూన్ వీడియోను షేర్ చేస్తూ... మొదటిసారిగా అమెరికా ఆ ప్రాంతంపై దాడి చేసినట్టు నిర్దారణ అయ్యిందని బాల్ అన్నారు. టోమాహాక్ క్షిపణులను కలిగి ఉన్న ఏకైక దేశం అమెరికా మాత్రమే అని, ఇజ్రాయెల్ వద్ద అవి ఉన్నట్లు తెలియదని పేర్కొన్నారు. మెహర్ న్యూస్ వీడియోలో ఆ ప్రాంగణాన్ని తాకిన క్షిపణి, టోమాహాక్‌ మిసైల్స్ ‌ను పక్కపక్కనే ఉంచి సరిపోల్చారు. ఇక, ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎటువైపు నుంచి ఏ డ్రోన్, ఏ క్షిపణి వచ్చి పడుతుందోననే ఆందోళనల వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa