పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. పశ్చిమబెంగాల్ పోలింగ్ ఈ నెల 29న ముగియగానే ఇంధన ధరలు పెరుగుతాయని వస్తున్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖండించింది.ఇలాంటి ఎలాంటి ప్రతిపాదన కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో గత రెండు నెలలుగా క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 50 శాతం పెరిగినప్పటికీ, గత నాలుగేళ్లుగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదని అధికారులు తెలిపారు.పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు ఉత్పత్తి ధరలు, పంప్ ధరల మధ్య వ్యత్యాసం పెరిగిందని సమాచారం. దీంతో ఇంధన రిటైలర్లు రోజుకు సుమారు రూ.2,400 కోట్ల మేర నష్టాలను ఎదుర్కొంటున్నారని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చని కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఈ నేపథ్యంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ ఈ వార్తలను ఖండించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని ఆమె స్పష్టం చేశారు.కొన్ని ప్రాంతాల్లో పానిక్ బైయింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉందని, అయితే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రిటైల్ ఔట్‌లెట్లపై మానిటరింగ్ కొనసాగుతోందని, అవసరమైన చోట్ల సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.దేశవ్యాప్తంగా తగినన్ని ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి సరఫరా కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. “ధరలు స్థిరంగా ఉన్నాయి, ఎలాంటి పెంపు నిర్ణయం లేదు” అని పేర్కొంటూ ప్రజలు వదంతులను నమ్మవద్దని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa