2014లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1.30 కోట్ల ఓట్లు వచ్చాయని, తెలుగుదేశం పార్టీకి 1.35 కోట్ల ఓట్లు వచ్చాయని గుర్తు చేసిన వైఎస్ జగన్ సోదరి షర్మిల, కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే తమ పార్టీకి తగ్గాయని, ఆ ఓట్ల మెజారిటీతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె, కడపలో తన అన్న జగన్ ఎంపీగా పోటీ చేస్తే, ఐదు లక్షల ఓట్ల మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తెచ్చుకున్నది కేవలం 5 లక్షల అధిక ఓట్లని, కడపలో మెజారిటీ ఉన్నన్ని ఓట్లు అదనంగా వచ్చివుంటే, ఇప్పుడు రాజన్న రాజ్యం ఉండేదని అన్నారు.ఆ మెజారిటీ కూడా చంద్రబాబుపై విశ్వసనీయతతో రాలేదని, మోదీ కారణంగా వచ్చిందని చెప్పారు. వ్యవసాయం దండగన్న బాబు, ఎన్నికలకు ముందు ఎంత రుణమైనా మాఫీ అంటూ తప్పుడు హామీ ఇచ్చినందుకు మెజారిటీ వచ్చిందని ఆరోపించారు. ఇప్పుడాయన నమ్మిన వారందరినీ మోసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి, ఆపై ఆ డిమాండ్ ను గాలికొదిలి చరిత్ర హీనుడిగా మిగిలాడని నిప్పులు చెరిగారు. వైఎస్ హయాంలో ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారని, ఒక్క అదనపు పన్నునూ వేయలేదని, వేటి ధరలూ పెంచలేదని షర్మిల చెప్పుకొచ్చారు. 2014లో బాబు చెప్పిన అబద్ధాలు ఓట్లను తెచ్చాయని, ఇప్పుడాయన నిజ స్వరూపం ప్రతి ఒక్కరికీ తెలిసిపోయిందని అన్నారు. జగనన్న వదిలిన బాణాన్నే, అంటూ ప్రసంగం ప్రారంభించిన ఆమె, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆయన తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపిస్తూ, "చంద్రబాబు అవినీతి ఖ్యాతి ఒక్క రాష్ట్రంలోనే కాదు. దేశమంతా పాకింది. ఆయన దుర్మార్గం మోదీకి కూడా అర్థమైపోయింది. ఇక చంద్రబాబుగారి పప్పులు ఉడకవు. ఆయన ఇంట్లో ఉన్న ఆ ఒక్క పప్పూ తప్ప" అంటూ పరోక్షంగా లోకేశ్ మీద సెటైర్ వేశారు. షర్మిల ప్రసంగానికి వైకాపా కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన రాగా, జగన్, విజయమ్మలు సైతం షర్మిల ప్రసంగాన్ని వింటూ నవ్వుతూ కూర్చున్నారు. ఇక, షర్మిల ప్రసంగిస్తుంటే ఆమె వెనుకే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు నిలబడి ఆమెను ప్రోత్సహించారు. తన వాగ్బాణాలతో, పంచ్ డైలాగులతో వైకాపా ప్లీనరీలో ప్రసంగించిన షర్మిల, కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు. "దేవుని దృష్టిలో కూడా చంద్రబాబు పాపం పండిపోయింది. ఎదురుగా వచ్చి దాడి చేయాలంటే ధైర్యం ఉండాలి. అది చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. ఆయనకు తెలిసిందల్లా వెన్నుపోటు పొడవటమే. ఆయన భార్య భువనేశ్వరి గారికి దండం పెట్టాలి. జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచినా, సొంత తండ్రిని అవమానించి, ఆయన మరణానికి కారణమైనా, ఆ మాంగల్యాన్నే చూసుకుని బతికేస్తోంది. ఎన్టీఆర్ గారి పటానికి దండం పెట్టుకుంటున్న ప్రతిసారీ, ఆయన కళ్లలోకి చూసే ప్రతిసారీ, ఆ తల్లి మనసులో పడే వేదన పాపం ఎవరికి చెప్పుకోగలదు? చంద్రబాబువి ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలే. మోసపు రాజకీయాలే. నీచమైన దిగజారిన రాజకీయాలు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, వైఎస్ఆర్ ఫోటోలు పెట్టుకుని గెలిచి, జగనన్న పేరు చెప్పుకుని గెలిచిన వారికి, ఆశ చూపించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారు చంద్రబాబు. ఇప్పటికీ వారి చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించుకునే దమ్ము ఈ పిరికి చంద్రబాబుకు లేదు" అని దుయ్యబట్టారు. షర్మిల ప్రసంగానికి అమితమైన స్పందన వస్తోంది. వైకాపా ప్లీనరీ వేదికపై షర్మిల తన పదునైన విమర్శలతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. "ఈయనకు చేతనైనదల్లా అధికారం అడ్డం పెట్టుకుని, అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లను, ఎవరిని వీలైతే వారిని ఉచ్ఛం, నీచం లేకుండా కొనటం. అడ్డంగా టేపుల్లో 'బ్రీఫ్డ్ మీ' అని, తన గొంతుతో అడ్డంగా దొరికినా, ఈ రోజు వరకూ విచారణ జరగకుండా తప్పించుకు తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబు నిప్పా? లేక తుప్పా? తుప్పే. వైఎస్ఆర్ సీపీ బలం ప్రజలకు వైఎస్ఆర్ సీపీపై ఉన్న అభిమానమే. వైఎస్ఆర్ సీపీ బలం ప్రజలకు జగనన్న మీదున్న నమ్మకం. ఈ బలం మరే పార్టీకీ లేదు. ఈ బలం మన సొంతం. దేవుని దయ, ప్రజల అండ, వైఎస్ఆర్ సీపీకి పుష్కలంగా వున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు, మనలో ప్రతి ఒక్కరమూ ఒక్కొక్క బాణమై దూసుకు వెళదాం. విజయం నిశ్చయం. మళ్లీ చెబుతున్నా. ఇచ్చిన మాట తప్పడం మా రక్తంలోనే లేదు. అబద్ధాలు చెప్పడం మాకు చేతకాదు. వైఎస్ఆర్ సీపీ విలువలతో కూడిన పార్టీ. విశ్వసనీయత మా ఊపిరి. వైఎస్ఆర్ సీపీ రైతుల పక్షం, దళితుల పక్షం, గిరిజనుల పక్షం. మైనారిటీల పక్షం. పేదల పక్షం, ప్రత్యేక హోదా పక్షం. రాబోతున్నది రాజన్న రాజ్యం. తేబోతున్నది జగనన్న. దీన్ని సాధ్యం చేయబోతున్నది దేవుని దీవెన. ఇది తథ్యం. సెలవు" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa