ప్రకాశం జిల్లా నల్లమల అభయారణ్యం పరిధిలో చింతల గిరిజనగూడెం గ్రామస్తులు కరోనా చింత లేకుండా జీవిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు.. ఆ గూడెం వాసులు. చిన్ననాటి నుంచి వివిధ వ్యాధులకు ఆకుపసర్లే వాడామని.. అవే తమలో రోగనిరోధకశక్తిని పెంచాయని చెబుతున్నారు. ఇప్పటివరకు తమకు మాస్కు వాడే అవసరం కూడా రాలేదని పేర్కొంటున్నారు. చింతల గిరిజనగూడెంలో సుమారు 710 మంది జీవిస్తున్నారు. వీరికి వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, గొర్రెల పెంపకమే ఆధారం. అటవీ ప్రాంతంలోని ఔషధ మొక్కల నుంచి వీచే చల్లటి గాలులు, ప్రశాంత వాతావరణం కరోనా వైరస్‌ను ఆ గూడెం దరిదాపులకు రాకుండా చేశాయి. గ్రామస్తుల్లో ఎవరికైనా సుస్తి చేస్తే ఔషధ మొక్కల ద్వారా వారికి వారే నయం చేసుకుంటున్నారు. అశ్వగంధి, కొండగోగు, నరమామిడి, సరస్వతి ఆకు, నేలవేము, పొడపత్రి, అడవిచింత, మయూరశిఖ, తెల్లగురివింద, నల్లేరు, అడవి ఉల్లి, సుగంధ మొక్కలు, చిల్లగింజలు, నాగముష్టి, విషముష్టి, అడవి తులసి, గడ్డిచేమంతి, ఉసిరి, కరక్కాయ ఇలా ఎన్నో ఔషధ మొక్కలను వివిధ వ్యాధులకు వాడుతున్నారు.
”పుట్టినప్పటి నుంచి కొండల్లోనే మా ఆవాసం. అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కల గురించి అవగాహన ఉంది. చిన్నచిన్న జబ్బులకు ఆకులు, అలములతోనే మేమే మందులు తయారు చేసుకుంటాం. కరోనా లాంటి జబ్బులు మా గూడెం వాసులకు రానే రావు. మాకు ఏ రోగమొచ్చినా అడవి మందులే వేసుకుంటాం. ఎప్పుడో గాని ఆస్పత్రికి వెళ్లం. మొదటి నుంచి పాత అలవాట్లనే పాటిస్తున్నాం. బయటి వ్యక్తులు వస్తే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటాం. గూడెంలో ఇంతవరకు ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు. అటవీ వాతావరణం, ఆహారమే మాకు రక్షణగా నిలుస్తోంది. తేలుకాటు, పాము కాట్లకు కూడా మాకు ఆకుపసరే మందు” అని ఆ గూడెం పెద్దలు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa