టీ20 వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం నమీబియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జడేజా (3/16), అశ్విన్ (3/20) ఆ జట్టును దెబ్బతీశారు. బుమ్రా (2/19) కూడా రాణించాడు. ఈ వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ఆడిన రాహుల్ చాహర్ (0/30) వికెట్ తీయలేకపోయాడు. 133 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్లు రాహుల్ (54*), రోహిత్ (56) రాణించడంతో ఒక వికెట్ కోల్పోయి 15.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.