చిత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగా పథకాలకు సంబంధించిన విధివిధానాలను ఖచ్చితంగా అమలు అయ్యేలా చూడాల్సిన భాధ్యత అధికారుల పై ఉందని జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అభివృద్ధి సి. హెచ్ శ్రీధర్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిపిఓ దశరథరామి రెడ్డి, డ్వామా ఏపిడి రామాంజనేయులు రెడ్డి, డిఎల్ డి ఓ శేషారెడ్డి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఇఇ శ్రీనివాస్ లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ఉ. 10:30 గం. ల లోపు బయో మెట్రిక్ హాజరు వేయాలని, వారానికి మూడుసార్లు వాలంటీర్ లు కూడా బయోమెట్రిక్ వేసేలా చూడాలని, సిబ్బంది విధుల ముగించుకుని వెళ్ళేటప్పుడు కూడా బయోమెట్రిక్ అటెండన్స్ వేయాలన్నారు. వాలంటీర్ ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించాలని అన్నారు. సచివాలయాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి వివరాలు తెలిపే బోర్డులు ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయాల్లో ఇంటర్ నెట్ కనెక్షన్ లకు సంబంధించి సేవలు నిరాటంకంగా అందేలా చూడాలని అన్నారు. సచివాలయాల పరిధిలో స్పందన కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని, వీలైనంత వరకు గ్రామాలలో సమస్యలు పరిష్కరిస్తే డివిజన్, జిల్లా కేంద్రానికి అర్జీదారులు రావాల్సిన అవసరం లేదన్నారు.
నవశకం ద్వారా వివిధ పథకాలకు అర్హులైన వారి వివరాలను తిరిగి అప్ లోడ్ చేయాలని అన్నారు. వాలంటీర్ లకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తి అవగాహన కల్పించాలని, అదే విధంగా సిటిజెన్ ఔట్ రీచ్ కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని అన్నారు.
జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమంను గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా అమలు చేయాలని, జిల్లాలోని 1, 412 గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేస్తే గ్రామంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. బృందావనాలను అన్నింటినీ కార్యాచరణ లోకి తీసుకువచ్చి సాలిడ్ వెస్ట్ మెనెంజ్మెంట్ ను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు సంబంధించి ఒక యాప్ ను రూపొందించి సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని అన్నారు. ఇంటి పన్ను వసూలు సకాలంలో చేయాలని అన్నారు. జనన, మరణ రికార్డులను సక్రమంగా నిర్వహించి గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించి మరొక యాప్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలన్నారు. డ్వామా పథకం ద్వారా ఈ నెలలో ఎన్ని రోజులు పని దినాలు కల్పించగలరని ముందుగానే అంచనాలు వేసి ఆయా మండలాలకు వివరాలు తెలపాలని, తద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. మార్చి వరకు ఎటువంటి పనులు చేపట్టనున్నారనే వివరాలు మరో వారం లోపు సమర్పించాలని అదే విధంగా ఏప్రిల్, మే, జూన్ లలో ఎటువంటి కార్యక్రమాలను చేపట్టాలో ఒక ప్రణాళికను రూపొందించాలన్నారు.
ప్రధానంగా సప్లై ఛానళ్ళు, ఫీడర్ ఛానళ్ళు, చెరువులు లోతు చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టి నీటిని నేరుగా చెరువులకు మళ్లించేలా చూడాలన్నారు. శ్మశాన వాటికల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన నిధులు వెంటనే వారి ఖాతాలకు జమ అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ వారిని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa