సీఎం సర్.. మాది నెల్లూరు జిల్లా.. మా జిల్లాల్లో నెల్లూరు పెద్దా రెడ్డి చాలా ఫేమస్ కొంచెం మా జిల్లాకి పెద్దారెడ్డిగారి పేరు పెడితే..మా వాళ్లంతా ఎంతో సంతోషిస్తారు. నువ్వుండవో.. సీఎం సామీ .. మా మదనపల్లికి .. ఎల్లయ్య ఎంతో చేసినాడు.. మరి ఆయన పేరు పెడితే మేము సంతోషిస్తాము ... ఆ పెట్టుకుందురులే మా గోదారి ప్రాంతానికి సుబ్బయ్య ఎంతో చేశారు సీఎం సర్.. కాస్త ఓ పాలి మా జిల్లాకి ఆయన పేరు పెట్టె యోచన చెయ్యండి సర్. ఏంటి ఈ లొల్లి మాకేమి అర్థం కావడం లేదు అనుకుంటున్నారా.. ఐతే ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివెయ్యండి..
ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది జగన్ ప్రభుత్వం. అయితే ఈ జిల్లాల పునర్విభజన కొందరికి మోదం..మరికొందరికి ఖేదంలా మారింది. పరిధుల విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రాజకీయ ఎత్తుగడతోనే జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు తెరలేపిందని, జిల్లాల విభజన ప్రకటన పీఆర్సీ ఉద్యమాన్ని అణిచివేసేందుకే అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
జిల్లాల విభజనపై అసంతృప్తి సెగలు !
ఏది ఏమైనప్పటికి జిల్లాల విభజన నేపథ్యంలో సుదీర్ఘకాల డిమాండ్లను పట్టించుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఆకాంక్షలు, డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. కొత్త జిల్లాల కోసం ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదన్న అసంతృప్తి కొందరి నుంచి వ్యక్తమవుతోంది.
ఈ సందర్భంలో కొన్ని ప్రాంతాల విషయంలో ప్రజల మధ్య కొన్ని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తాము ఆ జిల్లాలో ఉండలేమని తెగేసి చెబుతున్నారు. దీంతో జిల్లాల ఏర్పాటులో రగడ రాజుకుంటోంది. మెల్లగా నిప్పు రేగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమానికి సైతం రెడీ అవుతున్నట్లు సమాచారం.
పునర్విభజనలో గందరగోళం
కొత్త జిల్లాల ఏర్పాట్ల ప్రక్రియ రాజకీయ రగడగా మారుతోంది. ఇటు పాలాభిషేకాలు అటు నిరసన హోరన్నట్టు తయారైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా జిల్లాల పునర్విభజన అంశమే హాట్ టాపిక్ అయ్యింది. కొత్తగా ఇప్పుడు ప్రత్యేక జిల్లాల డిమాండ్ తెరపైకి వస్తోంది. దీని కోసం ప్రజలు,రాజకీయ ప్రత్యర్ధులు కూడా రోడ్డెక్కనున్నారు.
నంద్యాల లోక్ సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ నియోజకవర్గాన్ని కర్నూలులో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు, ఓర్వకల్లు మండలాలు కర్నూలుకు దగ్గరలో ఉండగా పాణ్యం, గడివేముల నంద్యాలకు సమీపంలో ఉన్నాయి. దీంతో కల్లూరు, ఓర్వకల్లు మండలాల్ని కర్నూలులో కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. కానీ పాణ్యం, గడివేముల మండలాలు నంద్యాలకు దగ్గరగా ఉన్నందున నంద్యాలలోనే కలపాలని అడుగుతున్నారు.
మరోవైపు కడప జిల్లా రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడంపై స్థానికులు ఆందోళనలకు దిగారు. రాజంపేటను కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంపై ఆందోళనలు చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా కేంద్రంగా కాకుండా రాయచోటిలో కలపడంపై స్థానికులు భగ్గుమంటున్నారు.
గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌లో కలపడంపైనా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్ని కలిపి ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని, లేకపోతే పెదకూరపాడును గుంటూరు రెవెన్యూ డివిజన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా కేంద్రంగా కాకుండా రాయచోటిలో కలపడంపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఈ రకంగా ప్రతి జిల్లాలోనూ ఏదో ఒక అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి.
జిల్లా పేర్ల డిమాండ్
కొత్తగా ఏర్పడే జిల్లాలకు బాలాజీ, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్, సత్యసాయిబాబాల పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకొంది. తిరుపతి కేంద్రంగా ఏర్పడనున్న జిల్లాకు శ్రీ బాలాజీ, విజయవాడ జిల్లా కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేర్లు పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు.
అదే సమయంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిల్లాలకు కొందరు తమ కులస్థుల పేర్లు తెరపైకి తీసుకొస్తుంటే మరికొందరు దేశానికి సేవ చేసిన మహనీయుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇన్ని డిమాండ్లు వస్తున్న క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సజావుగా సాగుతుందో లేదో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సమ్మతి తెలుపుతారా లేదా అనేదే తేలాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa