ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పతనమైన ఫేస్‌బుక్ మార్కెట్ విలువ

international |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 08:40 AM

అమెరికాలో మునుపెన్నడూ లేని విధంగా మార్కెట్ పతనమైంది. ఇంటర్నెట్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌‌కు స్టాక్‌ మార్కెట్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. గురువారం స్టాక్ మార్కెట్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా షేర్లు 25 శాతం మేర కుప్పకూలాయి. దీంతో మెటా కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కసారిగా 200 బిలియన్‌ డాలర్లు హరించుకుపోయింది. అది మన దేశ కరెన్సీలో దాదాపు రూ.15 లక్షల కోట్లు.


ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి క్షీణిస్తుందనే హెచ్చరికలతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించారు. దీంతో మెటా షేరు ఒకేసారి 25 శాతంపైగా పతనమైంది. ఇది 52 వారాల కనిష్ఠస్థాయిలో 237 డాలర్ల వద్దకు పడిపోయింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ 688 బిలియన్‌ డాలర్లుగా ఉంది. క్రితం రోజు ఈ కంపెనీ షేరు 323 డాలర్ల వద్ద ముగిసింది.


ఫేస్‌బుక్‌‌కు రోజువారీ వినియోగదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. డిసెంబర్‌ క్వార్టర్‌లో ఈ సంఖ్య 192.9 కోట్లకు తగ్గింది. ఫేస్‌బుక్‌‌ను ప్రారంభించిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వినియోగదారులను కోల్పోయిన త్రైమాసికం ఇదేనని మార్కెట్ పండితులు చెబుతున్నారు. యాపిల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో గోప్యత, భద్రతకు సంబంధించి చేసిన మార్పులు, టిక్‌టాక్‌ వంటి పోటీదారుల నుంచి వస్తున్న సవాళ్లతో ఈ సమస్య తలెత్తిందని మెటా సంస్థ పేర్కొంది.


మెటా షేర్లు కుప్పకూలడంతో ఆ ప్రభావంవం ఇతర ఇంటర్నెట్‌ సంస్థల షేర్లపైనా పడింది. స్నాప్‌, ట్విట్టర్‌, పింటరెస్ట్‌ కంపెనీల షేర్లు సైతం భారీగా పతనమయ్యాయి. ఈ సంస్థల మార్కెట్‌ విలువ మొత్తం 15 బిలియన్‌ డాలర్ల మేర కిందకు తగ్గింది. గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ షేరు సైతం 2 శాతంపైగా క్షీణించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa