ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిజాబ్ పై రాజుకొంటున్న వివాదం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 07:41 PM

హింజాబ్ పై కర్ణాటకలో వివాదం రాజుకొంటోంది. హిందుత్వ పేరుతో కొన్ని సంస్థల  రంగ ప్రవేశంతో అది కాస్త మతం రంగు పులుముకొంటోంది. ఉడిపిలోని కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం క్రమంగా కర్ణాటక అంతటికీ వ్యాపించింది. గత నెలలో ఆరుగురు అమ్మాయిలు స్కార్ఫ్‌తో కాలేజీకి రాగా.. వారిని లోపలికి రానివ్వకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీ బయట ఆందోళనకు దిగడం.. తర్వాత దీనిని నిరసిస్తూ మరికొంతమంది విద్యార్థులు కాషాయ కండువాలతో కాలేజీలకి హాజరై నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సమస్య ఆ రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు పాకింది. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్పినా విద్యార్థులు వినడం లేదు. ఈ వివాదం రాజకీయ రంగును పులుముకోవడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి చేదాటుందని భావించిన కర్ణాటక ప్రభుత్వం.. మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. మూడు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ప్రజలంత సంయమనం పాటించి, శాంతియుతంగా ఉండాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని సీఎం సూచించారు. మరోవైపు, హిజాబ్ వివాదంపై విచారణను కర్ణాటక హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. అయితే, మంగళవారం నాటి విచారణలో మాత్రం తాము భావోద్వేగాల ఆధారంగా నిర్ణయం తీసుకోమని, రాజ్యాంగమే మాకు భగవద్గీత అని స్పష్టం చేసింది. అయితే, విద్యార్థులు సంయమనం పాటించి, ప్రశాంతంగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దని సూచించింది. ప్రజల జ్ఞానం, ధర్మంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అదే ఆచరించాలని తాము భావిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఆందోళనలు చేయడం, రోడ్లపైకి రావడం, నినాదాలు చేయడం, విద్యార్థులపై దాడులు చేయడం, విద్యార్థులు ఇతరులపై దాడులు చేయడం మంచిది కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. టీవీల్లో నిప్పు, రక్తం చూస్తే జడ్జీలు కంగారు పడతారని.. ఒకవేళ మనసు కలవరపడితే బుద్ధి పని చేయదని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa