ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోల్టు విప్పుతుండగా పేలుడు.. ట్రాక్టర్‌ డ్రైవర్‌ దుర్మరణం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 10:54 AM

విజయనగరం జిల్లాలో అనుకోని ఓ విషాద ఘటన వ్యక్తి ప్రాణం తీసింది. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. టైరు పంక్చర్‌ అయిందని.. గాలి పూర్తిగా ఉండదని భావించి టైరు విప్పుతున్న క్రమంలో...ఒక్కసారిగా పెద్దశబ్దం చేస్తూ అది పేలిపోయింది. రెప్పపాటులో డ్రైవర్‌, తన సహాయకుడు కొన్ని అడుగుల దూరానికి ఎగిరి పడ్డారు. గాయపడిన ఇద్దరిలో ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. కర్లాం గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


కర్లాం గ్రామానికి చెందిన పాలూరు వెంకటరమణ(45) సొంతంగా ట్రాక్టర్‌ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం వెనుక టైరు గాలి తగ్గడాన్ని గమనించాడు. పంక్చర్‌ అయి ఉంటుందని భావించి అదే గ్రామానికి చెందిన తోలాపు గోవిందరావు సహకారంతో పంక్చర్‌ వేయించడానికి ట్రాక్టర్‌ను స్థానికంగా ఉన్న గ్యారేజీకి తీసుకెళ్లారు. అక్కడ తామే స్వయంగా టైరు బోల్టులు విప్పడం ప్రారంభించారు.


ఈ క్రమంలో టైరు ఒక్కసారిగా పెద్దశబ్దం చేస్తూ పేలిపోయింది. ఆ తీవ్రతకు ఇద్దరూ పది అడుగుల దూరంలో పడిపోయారు. ఘటనలో ఇద్దరికీ కుడి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. కర్లాంలో ప్రాథమిక చికిత్స అనంతరం చీపురుపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విజయనగరం తరలిస్తుండగా వెంకటరమణ మార్గమధ్యలో మృతి చెందాడు. వెంకటరమణకు భార్య పార్వతి, ఇద్దరు కుమారులు, తల్లి సత్తెమ్మ ఉన్నారు. పోషించే పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa