భూమి నుంచి మామూలు కంటితో చూస్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కనిపించదు. పవర్‌ఫుల్ టెలిస్కోపులతో చూసినా చిన్న చీమ సైజులో మాత్రమే అది కనిపిస్తుంది. ఎందుకంటే భూమి నుంచి అది చాలా దూరంలో ఉంటూ... భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఏ సమయంలో ఎక్కడ తిరుగుతుందో చెప్పేందుకు ప్రత్యేక వెబ్‌సైట్లు ఉన్నాయి. తద్వారా అది ఎక్కడుందో తెలుసుకొని దాన్ని టెలిస్కోపుతో చూసేందుకు వీలు ఉంటుంది. ఐతే... సూర్యుడి ఎండ ఉన్నప్పుడు అది కనిపించదు. సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు... అది మెరుస్తూ నక్షత్రం లాగా కనిపిస్తుంది. సరిగ్గా అలాంటి సమయంలో ఔత్సాహికులు దాన్ని చూసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఓ ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ దాన్ని చూడటమే కాదు... స్పేస్ వాక్ ఫొటో కూడా తీశాడు. ఆస్ట్రో ఫొటోగ్రాఫరైన సెబాస్టియన్ వాల్ట్‌మెర్ (Sebastian Voltmer) గత వారం ఇది సాధించాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చాలా పెద్దదే ఉంటుంది. అది రోజూ అంతరిక్షంలో చాలా వేగంగా దూసుకుపోతూ ఉంటుంది. కాబట్టి దానికి ఉన్న పార్టులకు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ పార్టులకు రిపేర్లు చెయ్యాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన పని. చెప్పాలంటే ప్రాణాంతకం. అలాంటి పనిని చేపట్టడమే స్పేస్ వాక్ అంటారు. ఈ స్పేస్ వాక్ చేసే వ్యోమగాములు ISS నుంచి బయటకు వచ్చి... పనిచేయాల్సి ఉంటుంది. అక్కడి గడ్డకట్టే చలి వాతావరణం ఏమాత్రం సహకరించదు. ఈ క్రమంలో ఏమాత్రం పట్టు జారినా ప్రాణాలు అంతరిక్షంలో కలిసిపోతాయి. అందువల్ల ఇలాంటి పనిని అరుదుగా చేస్తుంటారు. సెబాస్టియన్.. సరిగ్గా ఇద్దరు వ్యోమగాములు స్పేస్ వాక్ చేస్తున్న సమయంలో... ఫొటో తీశాడు. అలా ఇప్పటివరకూ ఎవరూ తియ్యలేదు. మార్చి 23న నాసా (NASA) వ్యోమగామి రాజా చారి (Raja Chari), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కి చెందిన వ్యోమగామి మాట్టియాస్ మారెర్ (Matthias Maurer)... దాదాపు 7 గంటలపాటూ ISS బయట ఉండి స్పేస్ వాక్ చేశారు. రకరకాల మెయింటెనెన్స్ పనులను పూర్తి చేశారు. వాళ్లు ఆ పనులు చేస్తున్న సమయంలో... వాళ్లను కాప్చర్ చేశాడు సెబాస్టియన్. మారెర్ సొంత పట్టణమైన జర్మనీలోని సాంక్త్ వెండెల్ నుంచి ఈ ఫొటో తీశాడు సెబాస్టియన్. "సూర్యాస్తమయం తర్వాత నేను స్పేస్‌వాక్‌ని చూశాను. వ్యోమగామి మాట్టియాస్ మారెర్.. ఏదో ఎక్కుతున్నారు. అక్కడ రాడ్ షేపులో ఉన్న నిర్మాణం.. కెనడార్మ్2 గా పిలిచే రోబో చెయ్యి ఉంది. మారెర్‌కి శుభాకాంక్షలు. ఇది చాలా ఉత్తేజం కలిగిస్తోంది" అని వాల్ట్‌మెర్ ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa