వైసీపీ సర్కార్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాదుడే బాదుడు విధానంలో సాగుతున్న జగన్ సర్కారు మెడలు వంచేందుకు టీడీపీ కొనసాగస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ సర్కారు దోపిడీని ప్రశ్నించాలని కూడా ఆయన సూచించారు. ఈ మేరకు కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేసిన చంద్రబాబు.. జగన్ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు.
గతంలో సంతోషంగా సాగిన రాష్ట్ర ప్రయాణం తాజాగా సంక్షోభం దిశగా సాగుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త పన్నులు, పెంచిన విద్యుత్ చార్జీలు, ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇసుక, మద్యం లాంటి వాటితో జరిగే దోపిడీ దీనికి అదనమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ తరహా వైసీపీ సర్కారు విధానాలతో ప్రతి కుటుంబంపై ఏడాదికి హీనపక్షం రూ.1 లక్ష భారం పడుతోందని చంద్రబాబు చెప్పారు. ఈ బాదుడుతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తాను చేసే అప్పుల కోసం ప్రజల జేబులను ఖాళీచేస్తున్న జగన్ సర్కారు తీరును ఎండగట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పథకాల పేరుతో ప్రజల నుంచి పిండిన దాంట్లో 10 శాతాన్ని ప్రజలకు ఇచ్చి మిగిలిన 90 శాతాన్ని జగన్ తన జేబులో వేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ దోపిడీని ప్రశ్నించాలన్న చంద్రబాబు.. ప్రభుత్వ పన్నులు, బాదుడుపై టీడీపీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa