రష్యా విషయంలో తొలిసారిగా భారత్ వ్యతిరేక స్వరం వినిపించింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత మొదటి సారి భారత్ తీవ్రంగా స్పందించింది. బుచ్చాలో పౌరుల హత్యలను ఖండించింది. స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్ చేసింది. బుచ్చా వీధుల్లో పిట్టల్లా రాలిపోయినట్టున్న పౌరుల మృత దేహాల ఫొటోలు, వీడియోలు వెలుగులోకి రావడంతో భారత్ ఇలా స్పందించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ అంశంపై మాట్లాడారు. భద్రతా పరిస్థితులు దిగజారినట్టు చెప్పారు. ‘‘బుచ్చాలో పౌరుల హత్యలపై వస్తున్న వార్తలు ఎంతో కలతకు గురిచేస్తున్నాయి. దీన్ని మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. అలాగే, స్వతంత్ర దర్యాప్తునకు పిలుపునిస్తున్నాం’’ అని తిరుమూర్తి ప్రకటన చేశారు.
‘‘మానవతా అవసరాల పట్ల అంతర్జాతీయ సమాజం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. కనీస మానవ అవసరాలు, వైద్య సరఫరాలు సజావుగా సాగేందుకు సురక్షిత మార్గాలు తెరవడానికి మేము మద్దతిస్తున్నాం. ఉక్రెయిన్ లో ఉన్న దారుణ మానవతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశానికి, దాని పొరుగు దేశాలకు ఔషధాలు, ఇతర నిత్యావసర సరుకులను పంపిస్తున్నాం. మరింత వైద్య సరఫరాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని తిరుమూర్తి ప్రకటన చేశారు. యుద్ధం ఆరంభమైన నాటి నుంచే తాము చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బలంగా చెబుతూ వచ్చామని తిరుమూర్తి గుర్తు చేశారు. అమాయక పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు దౌత్య మార్గం ఒక్కటే ఆచరణీయంగా ఉండాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa