కొత్త కేబినెట్‌లో తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు చోటు దక్కింది. ఈ మేరకు అధిష్టానం ఆయన పేరును ప్రకటించింది. రాజీనామా చేసిన ఐదు రోజులకే.. తిరిగి ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనూహ్య పరిణామాల నడుమ జిల్లా నుంచి తిరిగి ఆయన్నే అమాత్యుడిగా ఎంపిక చేశారు.
బొత్స సత్యనారాయణది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగెట్రం చేసిన బొత్స తొలినాళ్లలో పీఏసీఎస్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ యువజన నాయకుడిగా ఎదిగారు. 1999 సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా బొబ్బిలి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది దివంగత రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు.
రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చీపురుపల్లి నుంచి పోటీచేసిన ఆయన ఓటమి చవిచూశారు. అటు తరువాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ తన తొలి కేబినెట్‌లో బొత్సకు చోటు కల్పించారు. కీలకమైన మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖ కేటాయించారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్.. మొత్తం నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో పని చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్‌లోనూ, ఇప్పుడు వైకాపాలోనూ ఉత్తరాంధ్రలో అత్యంత కీలకనేత.