శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 19న భ్రమరాంబాదేవి అమ్మవారికి దేవస్థానం కుంభోత్సవాన్ని నిర్వనిర్వహించనుంది. ఈ కుంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం ఈవో ఎస్. లవన్న సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానం పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమఠం విరూపాక్షయ్యస్వామి, మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ బి. రాజేంద్ర సింగ్, ఏఎస్‌ఐ ఎం. రామయ్య పాల్గొన్నారు.
ఈవో లవన్న మాట్లాడుతూ కుంభోవత్సవం క్షేత్ర రక్షణ కోసం నిర్వహించే పండుగగా పేరొందిన కారణంగా ఉత్సవ కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు. కాగా దేవాదాయ చట్టం అనుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి, జీవహింస పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. క్షేత్రపరిధిలో జంతు, పక్షి బలి నిషేదాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్ని విభాగాల యూనిట్ అధికారులను, పర్యవేక్షకులను, సిబ్బందిని ఆదేశించారు. స్థానికులలో జంతుబలి నిషేధంపై అవగాహన కల్పించేందుకు క్షేత్రపరిధిలో ప్రధాన కూడళ్లలో, పలు ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని శ్రీశైల ప్రభ విభాగాన్ని ఆదేశించారు. అదేవిధంగా ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా జంతుబలి నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు.
కుంభోత్సవానికి ముందురోజున అన్ని విభాగాల యూనిట్ అధికారులు క్షేత్రంలో గస్తీ ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక సోలీస్ సిబ్బంది, దేవస్థానం భద్రతా విభాగం తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవ ప్రారంభానికి నాలుగైదు రోజుల ముందునుంచే టోల్‌గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, బస్సులలో జంతువులను, పక్షులను అనుమతించకుండా ఆర్టీసీకి లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉత్సవ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించనున్ను కారణంగా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కుంభోత్సవం రోజున ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. అనంతరం ధర్మకర్త మండలి సభ్యులు మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.