అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిన్నారి మరణంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. పోలీసులు, మంత్రి అతి కారణంగా చిన్నారి ప్రాణాలు పోయాయని మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటన కోసం పోలీసులు శుక్రవారం ఓవర్ యాక్షన్ చేశారన్నారు. దీంతో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన హరిజన గణేష్, ఈశ్వరమ్మ దంపతుల ఏడాది వయసున్న చిన్నారి బలైందన్నారు. ఇది ముమ్మాటికీ మంత్రి, పోలీసులు చేసిన హత్యేనని ఆరోపించారు. అనారోగ్యంతో చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని ప్రాధేయపడినా, పోలీసులు వదలకపోవడంతోనే నడిరోడ్డుపైనే ఆ చిన్నారి కన్నుమూసిందన్నారు. మీ ఆర్భాటాల కోసం శిశువుల్ని చంపేయడమే శిశు సంక్షేమమా మంత్రి గారూ అని ప్రశ్నించారు. ఘటనకు కారణమైన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.