రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నవారిని కింద పడేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు దోచుకెళ్తున్న పాతనేరస్తుడిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. మహారాష్ట్ర, నాగపూర్ కు చెందిన అనిల్ కుమార్ ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటూ స్థానికంగా కూలీ పని చేస్తున్నాడు. ఈనెల 9న రాకిల్స్ కాలనీలో తూముల సతీష్ కుమార్ తన ఇంటికి నడచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన అనిల్ కుమార్ అతడిని ఒక్కసారిగా వెనక్కి నెట్టి మెడలో ఉన్న 13 గ్రాముల బంగారు మెడ గొలుసుతో పాటు చొక్కా జేబులో నుంచి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ సమీపంలో అను మానాస్పదంగా తిరుగుతున్న అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి బంగారు గొలుసు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.