ఇటీవల అంబేద్కర్ జయంతిని అన్ని పార్టీలు ఘనంగా నిర్వహించాయి. కుల వివక్షపై రాజకీయ నాయకులు గొప్ప ప్రసంగాలు చేశారు. అయినా దళితులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ దళిత యువకుడి పట్ల అమానవీయంగా కొందరు ప్రవర్తించారు. ఓ దళిత యువకుడి రహస్య శరీర భాగాల్లోకి కొందరు వ్యక్తులు మద్యం బాటిల్‌ను చొప్పించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
యూపీలోని మహోబా జిల్లాలోని అంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ శివారులో ఈ నెల 15న కొందరు వ్యక్తులు మద్యం తాగారు. ఆ సమయంలో అటువైపు మల విసర్జనకు వెళ్తున్న ఓ దళిత యువకుడిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో దుర్భాషలాడారు. దాడి చేసిన వ్యక్తి తన శరీర భాగాలలో మద్యం బాటిల్‌ను చొప్పించి, పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన యువకుడు భయంతో ఈ విషయాన్ని మొదట ఎవరికీ చెప్పలేదు. అయితే నొప్పి తీవ్రం కావడంతో ఇంట్లో వాళ్లకు జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.