వరట్నం వంటి దురాచారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, కొందరి ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. అత్యాశకు అంతేలేకుండా గొంతెమ్మ కోరికలు కోరుతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి తనకు అత్తింటి వారు బైక్ కొనివ్వలేదని అలిగాడు. ఎన్నిసార్లు అడిగినా అత్తింటివారు స్పందించలేదని, భార్యకు విడాకులిచ్చేశాడు. ఈ దారుణ ఘటన గురించిన వివరాలిలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చందన్‌నగర్‌కు చెందిన నజియా అనే యువతికి సల్మాన్ అనే వ్యక్తితో 2020లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నంతో పాటు బైక్ కూడా కొనిస్తామని నజియా తండ్రి ఒప్పుకున్నాడు. నజియా-సల్మాన్ జంటకు ప్రస్తుతం ఏడాది వయసున్న కుమార్తె కూడా ఉంది. కొన్నాళ్లుగా బైక్ విషయంపై సల్మాన్ తన భార్య నజియాపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. బైక్ కొనివ్వకుంటే వదిలేస్తానని బెదిరించాడు. అయిప్పటికీ నజియా తండ్రి వద్ద డబ్బులు లేకపోవడంతో అల్లుడికి బైక్ కొనివ్వలేకపోయాడు. దీంతో భార్య నజియాను, ఏడాది వయసున్న కుమార్తెతో సహా పుట్టింటికి పంపేశాడు. శనివారం అత్తింటికి వెళ్లి, వారితో తీవ్రంగా గొడవపడ్డాడు. ఆవేశంలో ట్రిపుల్ తలాక్ చెప్పి, అక్కడి నుంచి వచ్చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.