నిన్న భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనా తర్వాత నష్టాల్లోకి జారుకుంది.సోమవారం నాటి భారీ పతనం నేపథ్యంలో తొలి కొనుగోళ్లకు మద్దతు లభించింది. సోమవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన అమెరికా మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదులుతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలు, అనూహ్య త్రైమాసిక ఫలితాలు, పెరుగుతున్న చమురు ధరలు మరియు పెరుగుతున్న కరోనా కేసులు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ 57,381 పాయింట్ల వద్ద ప్రారంభమైంది, కనిష్టంగా 57,027 పాయింట్లు మరియు గరిష్టంగా 57,460 పాయింట్లను తాకింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 57,066 వద్ద నిలిచింది. నిఫ్టీ 17,258 పాయింట్ల వద్ద ప్రారంభమై గరిష్టంగా 17,275 పాయింట్లు, కనిష్ట స్థాయి 17,152 పాయింట్లను తాకింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో నిఫ్టీ 7.35 పాయింట్లు క్షీణించి 17,165 వద్ద కొనసాగుతోంది.