నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసు ఫైల్స్ మాయమవడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యంగ్యపూరిత వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ తరహాలో 'కాకాణి ఫైల్స్' సినిమా తీయొచ్చని అన్నారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కోర్టులో చోరీ విషయంపై విమర్శలు చేశారు. చోరీ కేసులో ఎస్పీ చేసిన ప్రకటన అర్ధరహితమన్నారు. కుక్కలు మొరిగితే ఏ దొంగైనా కోర్టులోకి ఎందుకు వెళతాడని, అందులోనూ మంత్రికి సంబంధించిన ఫైలును మాత్రమే ఎందుకు దొంగిలిస్తాడని ప్రశ్నించారు. పోలీసులు చెబుతున్న కథనం నమ్మదగినదిగా లేదని చెప్పారు. ఇక సీఎం వైఎస్ జగన్ కేబినెట్‌లోని మరో మంత్రి అంబటి రాంబాబు పైనా ఆయన విమర్శలు చేశారు. అంబటికి 'నోటి పారుదల' ఎక్కువని, ఆయనకు 'నీటి పారుదల' శాఖ ఇచ్చారని వ్యంగ్యంగా మాట్లాడారు.