వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉన్న వీర విధేయుల్లో మాజీ డిప్యూటీ సీఎం ఒకరు. ఆమెకు జగన్ అంటే చాలా ఇష్టం.. జగన్ ను దేవుడు ఇచ్చిన అన్నగా భావిస్తారు. అంతేకాదు తన కూతురుకి.. జగన్ లో జగ.. భారతిలో తి కలిపి.. జగతి అని పేరు కూడా పెట్టుకున్నారు. సీఎం పై టిక్ టాక్ లు కూడా చేశారు. ఆమె ఎవరో కాదు పాముల పుష్ప శ్రీ వాణి.. మొన్నటి వరకు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆమె మాజీ అయ్యారు. దీంతో రైతుగా, తోటమాలిగా మారారు.
రైతు అంటే ఫుల్ టైం అనుకుంటే పొరపాటే.. తన సరదా కోసం ఇలా ఇంటి దగ్గరే సేంద్రీయ పంటలు పండిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ప్రకృతి వ్యవసాయంలో మునిగిపోయారు. ఇటీవల సీఎం జగన్ చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పుష్ప శ్రీవాణి గిరిజన శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇప్పుడు మంత్రి పదవి పోవడంతో.. గతంతో పోల్చుకుంటే కాస్త ఫ్రీ అయ్యారు. అంటే విరామ సమయం ఎక్కువ దొరుకుతోంది. దీంతో ఇలా కాస్త సమయం దొరికినప్పుడల్లా.. తన అభిరుచికి తగ్గట్టు.. స్వయంగా కూరగాయాలు పండిస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అయినా.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తన ఇంటి దగ్గరే ఉన్న ప్లేస్ లో ఎలాంటి హాని లేకుండా ఉండేందుకు.. పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో ఇంటి పెరటిలో ఇలా కూరగాయల పెంపకం చేపట్టారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామంలో ఉన్న తన ఇంటి ఆవరణలో పెరటి తోట పెంచుతున్నారు. దాదాపు 20 సెంట్ల స్థలంలో క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి, క్యాబేజీ, టమాటా, వంగ, ఆకుకూరలు సాగు చేశారు. అయితే ఆమె ఊహించినట్టే పంట కూడా బాగా చేతికి వస్తోంది. ఆడుతూ పాడుతూనే ఇలా వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే మోటోతో.. సేంద్రీయ వ్యవసాయానికి ఆమె సై అంటున్నారు.
తాజాగా సోషల్ మీడియా ద్వారా తను చేస్తున్న పనిని అందరితో షేర్ చేసుకున్నారు. తన ఇంటి పెరటిలో ఎటువంటి ఎరువులు వాడకుండా.. సహజసిద్దంగా పండించిన కూరగాయలు. పంట చేతికొచ్చి కూరగాయలు కోసినపుడు చాలా ఆనందంగా ఉంది. బయటి మార్కెట్లో రసాయన ఎరువులు వినియోగించి పండించిన కూరగాయలు లభిస్తుండటంతో సేంద్రియ పద్ధతిలో పండించాలని నిర్ణయించాను అంటూ అభిమానులకు సందేశం ఇచ్చారు.
ఈ ప్రకృతి సాగుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు ఆమె. ముఖ్యంగా భూసారం పాడవ్వకుండా, నాణ్యమైన దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా బయటి కల్తీలకు చెక్ పెట్టొచ్చని దానితో పాటు.. ఆరోగ్య కరమైన కూరగాయలు తీసుకోవడంతో.. ఆరోగ్యంగా కూడా ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు డిప్యూటీ సీఎం హోదాలో ఓవైపు అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నా.. వ్యవసాయంపై ఉన్నఇష్టంతో అప్పుడప్పుడూ ఇలా పంటలు పండిస్తున్నారు. అది కూడా ఇంటి ఆవరణలో పెరటి తోటతో సాగు చేస్తున్నారు. కూరగాయలు కూడా మంచి దిగుబడి వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.