జనసేన అధినేతకు సిద్దంతాం అంటూ ఏమీ లేదని ఇతరుల పల్లకీ మోయడమే ఆయన సిద్ధాంతమని ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ కు ఒక జెండా, అజెండా అంటూ ఏమీ లేవని, ఇతరుల పల్లకీ మోయడమే ఆయన సిద్ధాంతం అని అన్నారు. అందుకే, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల్చకుండా, ఇతరులకు ధారాదత్తం చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదేనా పవన్ కల్యాణ్ పార్టీ సిద్ధాంతం? అని ప్రశ్నించారు. తమ పార్టీపై పవన్ అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపైనా మండిపడ్డారు. సీఎం జగన్ మొత్తం క్యాబినెట్ మార్చేస్తానని చెప్పినట్టు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయం చంద్రబాబుకు ఎలా తెలుసని నిలదీశారు. ఒకవేళ చంద్రబాబు కూడా క్యాబినెట్ లో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ క్యాబినెట్ లో మంత్రులందరూ ఉత్సాహం ఉన్నారని, చంద్రబాబులో అభద్రతా భావం ఏర్పడిందని ఆదిమూలపు వ్యాఖ్యానించారు.
ఇక, ప్రకాశం జిల్లా వైసీపీలో ఎలాంటి లుకలుకలు లేవని స్పష్టం చేశారు. బాలినేనితో విభేదాలు ఉన్నాయన్నది తప్పుడు ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. అయితే, మంత్రి పదవి కోల్పోయిన వారిలో భావోద్వేగాలు ఉండడం సహజమేనని అన్నారు.