మనందరికీ జీవితంలో ఒక్కసారైనా జమ్మూకాశ్మీర్‌కి వెళ్లాలనీ... అక్కడి మంచు పర్వతాల్లో మంచును ముద్దలుగా చేసి... ఒకరిపై ఒకరు విసురుకొని ఆడుకోవాలని ఉంటుంది. పిల్లలకైతే... ఎన్నో ఆశలుంటాయి. ఆ చిట్టి హృదయాల్లో కాశ్మీర్ గురించి అందమైన ఊహలుంటాయి. పాఠాల్లో చదువుకున్న విషయాల్ని గుర్తుంచుకొని... కాశ్మీర్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అక్కడికి త్వరలో వెళ్లబోతున్నాం అని తల్లిదండ్రులు చెప్పగానే... తమ వంతుగా కొంత పాకెట్ మనీ దాచుకుంటారు. ఆ డబ్బుతో కాశ్మీర్‌లో ఏదో ఒకటి కొనుక్కోవాలని అనుకుంటారు. ఇలా పిల్లలకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ చిన్నారికి కూడా ఓ ఆశ ఉంది. అది తీరకపోవడం విచారకరం.
ఆ చిన్నారికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ పాప దాల్ లేక్‌లో పడవపై వెళ్తూ... ఏఎన్ఎన్ న్యూస్ కి బైట్ ఇచ్చింది. "నేను ఒకే ఒక్క కోరికతో ఇక్కడికి వచ్చాను. మంచును ముట్టుకోవాలి అన్నదే నా కోరిక. కానీ ఇక్కడ మంచు లేదు. మేము నిన్న విమానంలో వచ్చాము. ఎంతో ఆనందం కలిగింది. మేము హోటల్‌లో దిగాం. మేము తులిప్ గార్డెన్‌కి వెళ్లాలనుకున్నాం. మేము బోట్ హోటల్‌కి వెళ్లాలనుకున్నాం. నేను మొదటిసారి కాశ్మీర్‌కి వచ్చాను. కాశ్మీర్ చాలా అందమైన ప్రదేశం. చక్కటి భాష ఉంది. నాకు హోటల్స్, బోట్స్, పర్వతాలు ఇష్టం. నా లక్ష్యం మాత్రం మంచును ముట్టుకోవాలి అన్నదే. ఎవరైనా కాశ్మీర్‌లో మంచును చూశారా? నేను పర్వతాలపై మంచును చూశాను. అవి చాలా చల్లగా ఉంటాయి. ఎవరూ అక్కడికి వెళ్లే ధైర్యం చెయ్యరు. అక్కడికి వెళ్లాలంటే, ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలంటే కొన్ని రోజులు పడుతుంది" అని ఆ చిన్నారి బైట్‌లో తన ఆవేదనను చెప్పుకుంది.
ట్విట్టర్‌లో జమ్మూకాశ్మీర్ పోలీసైన ఇంతియాజ్ హుస్సేన్ (Imtiyaz Hussain)... తన అకౌంట్ @hussain_imtiyazలో ఏప్రిల్ 16, 2022న ఓ వీడియోని పోస్ట్ చేశారు. "హే క్యూటీ... మళ్లీ శీతాకాలంలో రా. నేను నీకు మాట ఇస్తున్నాను. అప్పుడు ఇక్కడ మంచు తప్పక ఉంటుంది" అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోని ఇప్పటికే 5 లక్షల మంది చూడగా... 25వేల మందికి పైగా లైక్ చేశారు.
ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చుతోంది. అంత చిన్న పాప ఎంతో చక్కగా మాట్లాడటం, తన ఆవేదన చెప్పుకోవడం నెటిజన్లను కదిలిస్తోంది. "ఆమె చాలా ఏకాగ్రతతో ఉంది. ఇతరులు, చలి ఆమెను కదిలించలేకపోతున్నాయి. తన అభిప్రాయాలపై భావ వ్యక్తీకరణ అద్భుతంగా ఉంది. గ్రేట్" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా... "నా కొలీగ్ తన ఫ్యామిలీ ట్రిప్ ముగించుకొని జమ్మూకాశ్మీర్ నుంచి వెనక్కి వచ్చింది. ఆమె ఒక కంప్లైంట్ చేసింది. స్థానిక ట్రావెలింగ్ సంస్థలు టూర్ ధరలను బాగా పెంచేశాయని తెలిపింది. మిగతా అంతా బాగానే ఉందనీ... జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని చెప్పింది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
"అవును... ఒకసారి వస్తే... మళ్లీ మళ్లీ వస్తారు. కాశ్మీర్ అంటే శ్రీనగర్, గుల్‌మార్గ్ మాత్రమే కాదు. అది దేవుడిచ్చిన గిఫ్టు" అని మరో యూజర్ స్పందించారు. "ఆ పాప ఓ గ్రాడ్యుయేట్ కంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది. మనం ఓ కొత్త వేరే సమాజాన్ని చూస్తున్నాం. ఆమె చాలా స్వీట్. మళ్లీ రావాలి. కాశ్మీర్ నిన్ను తెల్లటి చేతులతో ఆహ్వానిస్తుంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.