కాళ్ళ పారాని ఆరకముందే ఓ నవ వరుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం మాచర్ల సాగర్ రింగ్ రోడ్ కు చెందిన సత్యనారాయణ రాజు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు పత్తిగుడుపు కిరణ్ కుమార్ ( 32 ) కు ఈ నెల 11 వ తేదీ తెనాలి వించిపేటకు చెందిన యువతితో వివాహం జరిగింది. 12వ తేదీ న కిరణ్ కుమార్ తన భార్యను తీసుకుని మాచర్ల వెళ్లాడు. 16వ తేదీ మొదటి రాత్రి కి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. దీంతో తెనాలి వచ్చేందుకు బయలుదేరిన కిరణ్ కుమార్ గుంటూరు బస్టాండ్లో నాలుగు గంటల సమయంలో బస్సు దిగి తాను ఇప్పుడే వస్తానని భార్యకు చెప్పి వెళ్లిపోయాడు. రాత్రి అయినా రాకపోవడంతో అతని సెల్ ఫోన్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అని రావడంతో కిరణ్ కుమార్ బంధువులకు సమాచారం అందించారు.
అనంతరం గుంటూరు నుండి తెనాలి పుట్టింటికి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉందని తాడేపల్లి పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. మృతుడి జేబులో ఉన్న సెల్ ఫోన్ లోని సిమ్ కార్డు తీసి పరిశీలించి బంధువులకు సమాచారం ఇవ్వగా తల్లి విజయలక్ష్మి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన కుమారుడేనని గుర్తించింది. ఫస్ట్ నైట్ అంటే భయపడ్డాడని, వారి స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి కట్టుకున్న భార్యను, మమ్మల్ని అన్యాయం చేశాడని తల్లి వ్యక్తం చేసింది. జరిగిన ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.