ఆమె ట్రాన్స్‌జెండర్. తన కంటే వయసులో చిన్నవాడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. ఇటీవల వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువకుని కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించినట్లు నమ్మించారు. ఇంటికి తీసుకెళ్తూ దారి మధ్యలో తమ అసలు స్వరూపం చూపించారు. ట్రాన్స్‌జెండర్‌పై దాడి చేసి, నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని నెల్లూరు జిల్లా పనకుడి గ్రామానికి చెందిన ఉదయ ట్రాన్స్‌జెండర్. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని పాలవూరులో ఉంటున్నారు. కూడంకుళం సమీపంలోని శ్రీరంగనారాయణపురానికి చెందిన బాల ఆనంద్‌తో ఉదయకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడడంతో సహజీవనం చేశారు. వారం క్రిందట ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం ఆనంద్ కుటుంబ సభ్యులకు తెలిసింది. వారంతా వచ్చి, పెళ్లి తమకు ఇష్టమేనని చెప్పారు. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. దారి మధ్యలో వారి నిజస్వరూపం వెల్లడైంది.
ట్రాన్స్‌జెండర్ ఉదయతో అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులు గుద్ది, విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ తర్వాత ఉదయను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. బాల ఆనంద్‌ను బెదిరించి తమతో పాటు తీసుకెళ్లిపోయారు. తీవ్రగాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఉదయను సమీప గ్రామస్తులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. తోటి ట్రాన్స్‌జెండర్‌పై దాడి జరగడంతో ట్రాన్స్ కమ్యూనిటీ స్పందించింది. కూడంకుళం పోలీస్ స్టేషన్‌లో వారంతా ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన బాల ఆనంద్ తండ్రి బాలమురుగన్, సోదరుడు సుభాష్, బంధువులు మణికందన్, శక్తివేల్, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు తమిళనాట తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రమంతటా ట్రాన్స్‌జెండర్ ఉదయకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి.