అసలే కోవిడ్‌తో అల్లాడుతున్న ప్రపంచ దేశాలను కొత్త వ్యాధులు కలవరపెడుతున్నాయి. తాజాగా చిన్నారుల్లో అంతుచిక్కని కాలేయం వాపు వ్యాధి బెంబేలెత్తిస్తోంది. తొలుత అమెరికాలో, ఆ తర్వాత బ్రిటన్, క్రమంగా ప్రపంచ దేశాల్లో ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతోంది. 2021 అక్టోబర్‌లో అమెరికాలోని అలబామా ప్రాంతంలో ఆరేళ్లలోపు చిన్నారులు 9 మంది ఈ వ్యాధికు గురయ్యారు. మూడు నెలలు గడిచేసరికి బ్రిటన్‌లోని ప్రధాన నగరాల్లోని 73 మంది చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. తాజాగా మరో మూడు దేశాల్లోని చిన్నారుల్లో ఈ వ్యాధి వెలుగు చూసింది. బాధిత చిన్నారులకు అత్యవసర చికిత్స క్రింద కాలేయ మార్పిడిని వైద్యులు చేపట్టారు. మరో వైపు ఈ అంతుచిక్కని వ్యాధి సంగతి తేల్చే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.
ఈ వ్యాధిలో భాగంగా చిన్నారుల కాలేయంలో అనూహ్యంగా వాపు వస్తుంది. ఫలితంగా బాధిత చిన్నారులు హెపటైటిస్ ఏ, బీ, సీ, డీ, ఈ బారిన పడుతున్నారని తొలుత డబ్ల్యుహెచ్ఓ భావించింది. అయితే అది నిర్ధారణ కాలేదు. జలుబు, జ్వరాన్ని కలిగించే ఎడినోవైరస్, కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కొవ్-2 వైరస్ చిన్నారుల శరీరంలో కనిపించాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి ఏమిటనే దానిపై ఇప్పుడే ఓ నిర్ధారణకు రాలేమని డబ్ల్యుహెచ్ఓ నిపుణుల బృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాధి అమెరికా, యూకే, స్పెయిన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ చిన్నారుల్లో వెలుగు చూసింది. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో దురద, కళ్లు-చర్మం పసుపు పచ్చగా మారడం, విపరీతమైన జ్వరం, శ్వాసలో ఇబ్బందితో బాధపడతారు. అంతేకాకుండా కీళ్లు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, మూత్రం పచ్చగా రావడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. వ్యాధి సోకిన వారిని తాకినా ఇతరులకు అది సోకుతుంది.