దేశంలో కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. గత మూడు రోజుల్లో ఒక రోజు పెరిగిన ఆందోళన కలిగించిన కేసులు, మరో రోజు తగ్గడంతో ఉపశమనం కలిగింది. తాజాగా గత 24 గంటల్లో దాదాపు రెట్టింపు కేసులు నమోదవడం అందరినీ కలవరానికి గురి చేస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,067 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,47,594కు చేరింది. కరోనా బారిన పడి తాజాగా 40 మంది మరణించారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 5,22,006కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12,340 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదిలా ఉండగా సోమవారం వెల్లడైన గణాంకాలతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఒక్కసారిగా 2,183 కేసులు వెలుగు చూశాయి. అదే రోజు 214 మరణాలు సంభవించాయి. అయితే మంగళవారం వెల్లడైన గణాంకాలు కాస్త ఊరటనిచ్చాయి. నిన్న 1,247 కేసులు నమోదవగా, ఒక్కరు మాత్రమే చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళలలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు మరలా అమలు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు కేసుల పెరుగుదలకు కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.