విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది.
నిందితులను ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి వారిని విధులనుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేశారు. సీఎస్ ఆర్ఎంఓకి షోకాజ్ నోటీసు జారీచేశారు. శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు.