అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తను ఆ మహిళ పక్కన పెట్టింది. వివాహేతర సంబంధం మోజులో పడింది. చివరికి పరాయి సంబంధాల వ్యామోహంలో పడి భర్తనే అంతమొందించింది. దాదాపు ఐదేళ్లుగా సాగుతున్న విచారణ తర్వాత నిందితురాలికి కోర్టు కఠిన శిక్ష విధించింది. యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుపాడుకి చెందిన నల్లబోతు నరేంద్ర అనే వ్యక్తికి అతడి బంధువుల అమ్మాయి అయిన శ్రీ విద్యతో గతంలో వివాహమైంది. శ్రీవిద్య ప్రైవేటు పాఠశాలలో టీచర్ కాగా, నరేంద్ర వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. ఇదిలా ఉండగా పెళ్లికి ముందు నుంచే తన అక్క భర్త గొట్టిపాటి వీరయ్య చౌదరితో శ్రీవిద్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెళ్లైన తర్వాత కూడా వీరి మధ్య వ్యవహారం నడిచింది. ఈ విషయం కొన్నాళ్లకు నరేంద్రకు తెలిసింది. అతడు మందలించాడు. దీంతో బావపై మోజుతో ఉన్న శ్రీ విద్య ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకుంది. ఈ విషయాన్ని బావ వీరయ్య చౌదరికి తెలిపింది. వారంతా కలిసి అతడి హత్యకు ప్లాన్ వేశారు.
ముందస్తు ప్రణాళిక ప్రకారం 2017 డిసెంబరు 19న భర్తకు తన బావతో శ్రీ విద్య ఫోన్ చేయించింది. నరసరావుపేటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కి నరేంద్రను రప్పించారు. అక్కడ వీరయ్య చౌదరి కొందరు నిందితులతో కలిసి వేచి చూస్తున్నాడు. నరేంద్ర రాగానే మందు తాగించారు. అనంతరం ఓ బాకీ వసూలుకు రావాలంటూ నరేంద్రను వారు తమతో కారులో తీసుకెళ్లారు. మార్గం మధ్యలో అతడికి సెనైడ్ కలిపిన మందు తాగించారు. ఫలితంగా నరేంద్ర ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని ఓ కాలువ పక్కన పడేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పక్కనే పురుగుల మందు డబ్బా ఉంచారు. అయితే మృతుడి తండ్రి దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూశాయి. నిందితులపై అభియోగాలు రుజువు కావడంతో నరసరావుపేట 13వ జిల్లా అదనపు న్యాయస్థానం తాజాగా తీర్పు ఇచ్చింది. ముద్దాయిలు నలుగురికి జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.